Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు YSRCP నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ . మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదల కోసం ఆరోగ్యశ్రీని బలోపేతం చేసిందని, అయితే కూటమి ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. కోవిడ్ సమయంలోనూ వైఎస్ జగన్ పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా జరిగాయని గుర్తు చేశారు. చంద్రబాబు కొత్త మెడికల్ సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖ రాయడం దురదృష్టకరమని ఆయన ధ్వజమెత్తారు. “దోపిడీ కోసం ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేటు వారికి కట్టబెట్టడం దుర్మార్గం. చంద్రబాబు ఎప్పుడూ ప్రైవేట్ మనిషే. గతంలో కూడా ఇలాంటి నిర్ణయాలు చేశారు” అని బొత్స అన్నారు.
వ్యవసాయ రంగంలో సమస్యలు
కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా యూరియా సమస్య తీవ్రంగా ఉందని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. YSRCP హయాంలో ఎప్పుడూ యూరియా కొరత రాలేదని, ఇప్పుడు రైతులు యూరియా కోసం గంటల తరబడి లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. యూరియా సమస్యపై మాట్లాడితే ముఖ్యమంత్రి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రజలు ఈ మాటలను గమనిస్తున్నారని హెచ్చరించారు. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. దీనిపై సెప్టెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు.
విశాఖ ఉక్కుపై పోరాటం
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కూడా బొత్స గారు మాట్లాడారు. ఈ విషయంలో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, దీనిపై పోరాటం తప్పదని అన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయబోమని ప్రధాని లేదా ఉక్కు మంత్రితో చెప్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలను శాసనమండలిలో ప్రశ్నిస్తామని బొత్స స్పష్టం చేశారు.


