Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Botsa: స్టూడెంట్స్ అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకోవాలి

Botsa: స్టూడెంట్స్ అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకోవాలి

రాష్ట్రంలో పిల్లలందరికీ అక్షరాస్యత మరియు సంఖ్యా పరిజ్ఞానం సాధించడం ఉపాధ్యాయుల తక్షణ కర్తవ్యం అని విద్యలో నైపుణ్యాలు సాధన కోసం ఉపాధ్యాయులందరూ విద్యాప్రగతికి బాటలు వేయాలని రాష్ట్ర విద్యాశాఖమాత్యులు శ్రీ బొత్స సత్యనారాయణ అన్నారు. 3 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల లోపు పిల్లలకు ఫౌండేషనల్ లిటరసీ మరియు న్యూమరసీలో భాగంగా 1,2 తరగతులు భోదించు ఉపాధ్యాయులకు చిన్నారుల సంసిద్దత కోసం 6 రోజులుగా విజయవాడ శివారు కానూరు మురళీరిసార్ట్స్ లో నిర్వహిస్తున్నశిక్షణా తరగతులు మంగళవారం తో ముగిసాయి. శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖామాత్యులు శ్రీ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిధిగా హజరై మాట్లాడుతూ ఉపాధ్యాయులు పిల్లలతో మమేకమై ఆట, పాటలతో బోధన చేసినట్లయితే మనం ఆశించిన ఫలితాలు సాధించవచ్చన్నారు. నేర్చుకునే, నేర్పించే విధానంలో మన రాష్ట్ర ప్రభుత్వం సమూల మార్పులు తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో వ్యయప్రయాసలకోర్చి విద్యపై ఎంతో ఖర్చు చేసి దేశంలోనే అగ్రగామిగా నిలవగలిగిందన్నారు.
జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక వంటి కార్యక్రమాల ద్వారా ఎనలేని ప్రగతి సాధించామన్నారు. పాఠశాలల్లో మన బడి: నాడు -నేడు ద్వారా మౌలిక వసతులు కల్పించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాబోయే విద్యా సంవత్సరంలో డిజిటల్ విద్యను అందించనున్నామని, దీనికోసం ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. శిక్షణా సమయంలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు పరచాలని కోరారు. అందరూ కలిసి సహభాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో విద్యా సంస్కరణలు చేపడుతున్నామన్నారు. ఫౌండేషన్ కోర్సు నుంచి ఉన్నత విద్య వరకు అనేక మౌలిక వసతులను కల్పించి తద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
అనంతరం పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ మాధ్యమం కంటే బోధనా విధానాలే ముఖ్యమని, చిత్తశుద్ధితో ఉపాధ్యాయులు పని చేస్తే మనం పిల్లల నుండి ఆశించిన విద్యాప్రమాణాలు సాధించవచ్చన్నారు. విభిన్న ప్రక్రియలతో పిల్లలను పాఠశాల వాతావరణానికి సంసిద్ధం చేయాలన్నారు. జాతీయ నూతన విద్యావిధానాన్ని అనుసరించి పునాది విద్యకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి. శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చని, ఈ ప్రక్రియలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకారం ఎంతో అవసరమన్నారు. పునాది విద్యకు ఎంతో ప్రాధాన్యతనివ్వాలని, ఫౌండేషన్ స్థాయిలోనే పిల్లల్లో దాగి ఉన్న కౌశలాలను గుర్తించి మెరుగుపరచడానికి తగిన మార్గనిర్దేశాలతో ముందుకెళ్లాలని కోరారు.
ఈ సందర్భంగా శిక్షణాలో పాల్గొన్న రిసోర్సు పర్సన్లు తయారు చేసిన స్టాళ్లను తిలకించి ఉపాధ్యాయులను మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ అభినందించారు. అనంతరం ‘జ్ఞాన ప్రకాశ్’ శిక్షణా కరదీపికను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి, పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్ పి.పార్వతి, జాయింట్ డైరెక్టర్ (టెట్) మేరి చంద్రిక, స్టేట్ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ బి.విజయ భాస్కర్, ప్రథమ్ సంస్థ ప్రతినిధి సునీత, కీ రిసోర్సు పర్సన్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News