6 దశాబ్దాల సమస్య తొలగిపోయే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు పడింది.నంద్యాల జిల్లా పారుమంచాల గ్రామంలో కాకి లేరు వాగుపై రూ.5 కోట్లతో వంతెన నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. చిన్నపాటి వర్షానికి చుట్టుపక్కల 10 గ్రామాలు స్తంభించిపోయే సమస్యకు పరిష్కారంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేతుల మీదుగా హైలెవల్ వంతెనకు శంకుస్థాపన జరిగింది. ఎం.డీ.ఆర్ ప్లాన్ నిధుల ద్వారా కె.జి రోడ్డు నుండి పారుమంచాల రహదారి నందు ఈ బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను పారుమంచాల గ్రామవాసి , టీటీడీ ఈవో ధర్మారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడం వెంటనే స్పందించడంఇసుక కాకిలేరు వాగు వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే మంజూరైన నిధులకు టెండర్లు ముగియడంతో మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ చేతులమీదుగా భూమి పూజ నిర్వహించారు.
అరవై ఏళ్ల క్రితం నుంచి వాగుపై వంతెన లేక వర్షాకాలంలో పడే తమ కష్టాలను గుర్తించి వంతెనకు మోక్షం కలిగించడం పట్ల పారుమంచాల, తూడిచెర్ల,వాడాల, మద్దూరు,రేగడగూడూరు, వేల్పనూరు, వెలుగోడు గ్రామాల ప్రజలు , ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు శాసన సభ్యులు తొగురు ఆర్థర్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్, గ్రామ సర్పంచ్ మాధవరం ప్రకాశం, నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ రబ్బాని, జూపాడు బంగ్లా నాయకులు జంగాల పెద్దన్న, వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.