Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Buggana: దక్షిణ కొరియాలో మంత్రి బిజీ

Buggana: దక్షిణ కొరియాలో మంత్రి బిజీ

పెట్టుబడులకు అవకాశమున్న ఏ అవకాశాన్నీ ఏపీ వదులుకోదు

ఆర్థిక, ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దక్షిణా కొరియాలో పర్యటిస్తున్నారు. వివిధ వాణిజ్యవేత్తలు, నిపుణులతో సమావేశమవుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేయగల అవకాశాలపై చర్చిస్తున్నారు. వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ ఏపీలో అనుసరించే కీలకాంశాలపై అధ్యయనం చేస్తున్నారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా తొలుత భారత రాయబారి హెచ్.ఈ. అమిత్ కుమార్ తో బుగ్గన రాజేంద్రనాథ్ సమావేశమయ్యారు. ఏపీ ఆర్థికాభివృద్ధికి అవసరమైన అంశాలలో కొరియా భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి దిశగా కొరియాతో కలిసి పని చేసే అవకాశాలపైనా పరస్పరం చర్చించుకున్నారు. దక్షిణ కొరియా వ్యాపార విస్తరణకు అవసరమైన ఇండస్ట్రియల్ క్లస్టర్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసేందుకు ఏపీ సంసిద్ధతతో ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులు సహా సీ ఫుడ్ పై మరింత అవగాహన పెంచే బ్రాండింగ్ అంశంలో కలిసి ముందుకు సాగనున్నట్లు భారత్ కు చెందిన సౌత్ కొరియా రాయబారి అమిత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాయాబర కార్యాలయ ప్రతినిధి కె.స్వప్నిల్ తొరాట్ పాల్గొన్నారు.

- Advertisement -

ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ సీఎఫ్ఓ సహా సంబంధిత ప్రముఖులతో బుగ్గన భేటీ అయ్యారు. ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో మరింతగా కలిసి పని చేసే అవకాశాలపైనా ప్రధానంగా మంత్రి చర్చించారు. అందుకు ఐసీసీకే కూడా సానుకూలంగా స్పందించింది. పెట్టుబడులకు అవకాశమున్న ఏ అవకాశాన్నీ ఏపీ వదులుకోదన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. అందుకు అవసరమైన పరస్పర సహకారం ఎప్పుడూ ఉంటుందని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొరియా వెల్లడించింది. ఈ కార్యక్రమంలో గ్లోబల్ సీఎఫ్ఓ పంకజ్ శ్రీ వాత్సవ, బీకేఎల్ పార్ట్ నర్ జాంగ్ బీక్ పార్క్, టాగివ్ వ్యవస్థాపకులు, సీఈవో పంకజ్ అగర్వాల్, సేజ్ స్ట్రాటజీస్ సీఈవో ఇంబం చోయ్ తదితరులు పాల్గొన్నారు.

కొరియా ట్రేడ్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ ప్రతినిధులను కలిశారు.ఏపీకి పెట్టుబడులను తీసుకురావడంలో ‘కొట్రా’ భాగస్వామ్యమవుతుందని మంత్రి వెల్లడించారు. కొట్రాకు బెంగుళూరులో నెట్ వర్క్ కార్యాలయం ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఆ ఏజెన్సీ మంత్రి బుగ్గనకి తెలిపింది. పర్యటన అనంతరం కొట్రా ప్రతినిధులు ఏపీకి వచ్చి అవసరమైన సహకారం అందించడమే లక్ష్యంగా పనిచేస్తారని డైరెక్టర్ జనరల్ హియో జిన్వోన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ చో ఈనం, డిప్యూటి డైరెక్టర్ జో యాండ్, రీసెర్చ్ టీమ్ డైరెక్టర్ హాంగ్ చంగ్సేక్, అసిస్టెంట్ మేనేజర్ పార్క్ మనిజోంగ్ పాల్గొన్నారు.

దక్షిణా కొరియాలోని ప్రముఖ విశ్వవిద్యాలయమైన సామ్యూక్ లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలోని అధికారుల బృందం పర్యటించింది. ఆంధ్రప్రదేశ్ లో కొరియన్ లాంగ్వేజ్ ల్యాబ్ ల ఏర్పాటుపై సామ్యూక్ విశ్వవిద్యాలయం వైస్ ప్రెసిడెంట్ హ్యున్ హీ కిమ్ తో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చర్చించారు. కొరియన్ భాష నేర్చుకోవడం వలన ఆంధ్రప్రదేశ్ యువతకు విదేశాలు, కొరియాలో మరిన్ని ఉపాధి అవకాశాలు పెంచడమే తమ లక్ష్యమని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. వొకేషనల్ విద్యకు సంబంధించి సామ్యూక్ విశ్వవిద్యాలయం ఏపీకి అవసరమైన సహకారం అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కొరియన్ భాష నేర్చుకోవడం వలన ప్లేస్ మెంట్లను మరింతగా పెంచవచ్చన్నారు. • విద్యార్థుల మార్పిడితో యువతకు మరిన్ని అవకాశాలను కల్పించే మార్గాలను అన్వేషించే బాధ్యతను సామ్యూక్ విశ్వవిద్యాలయం ‘ఎస్పీఓసీ’కి కేటాయించింది. ఈ కార్యక్రమంలో సామ్యూక్ విశ్వవిద్యాలయం వైస్ ప్రెసిడెంట్ హ్యున్ హీ కిమ్, ఇంటర్నేషనల్ ఎఫైర్స్ డీన్ జియెన్ షిన్, లైఫ్ సైన్సెస్ లో పోస్ట్ -డాక్టోరల్ పరిశోధకులు ఎస్. ఉమావతి, ఫార్మాలో పోస్ట్ -డాక్టోరల్ పరిశోధకులు ఏ.వి. ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

దక్షిణ కొరియా పర్యటనలో చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News