Wednesday, September 25, 2024
Homeఆంధ్రప్రదేశ్Buggana: ప్రభుత్వం మనందరిది,. అభివృద్ధి మీది

Buggana: ప్రభుత్వం మనందరిది,. అభివృద్ధి మీది

యువగళం, వారాహి యాత్రలపై పంచులు

బేతంచెర్ల పట్టణ సమీపంలో 41 ఎకరాలలో ఏపీఐఐసీ ఆటోనగర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి వెల్లడించారు. అందుకు సంబంధించి బేతంచెర్లలో బుగ్గానిపల్లె వద్ద ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఇప్పటికే 7 ఎకరాలలో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఆటోనగర్ మధ్యన జాతీయ రహదారి వెళుతున్నందున మరింత అభివృద్ధికి ఆస్కారముంటుందని మంత్రి తెలిపారు. ఎలక్ట్రిక్, వెల్డింగ్, లారీ విడిభాగాలు, సహా అన్నీ ఒకే చోట ఉండేలా వసతులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా శ్రమ, సమయం వృథా కావన్నారు. డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రజల భాగస్వామ్యం వల్ల సాధ్యమైందని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న వాటర్ గ్రిడ్, 100 పడకల ఆస్పత్రి,ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్, జాతీయ రహదారి, ఐటీఐ హాస్టల్, వెటర్నరీ పాలిటెక్నిక్,షెఫర్డ్ ట్రైనింగ్ సెంటర్, ఐడీటీర్, కాలేజీలు, బస్ స్టాండ్, వాల్మీకి భవన్, వడ్డెర భవన్, బిల్వ స్వర్గం గుహలు, ప్రాచీన ఆలయాలు,పర్యాటక కేంద్రాలు, ప్రభుత్వ భవనాల వంటి అభివృద్ధి పనులు అనేకం పూర్తవుతున్నట్లు మంత్రి బుగ్గన వివరించారు. నలభైఏళ్లలో గత ప్రభుత్వాలు చేయలేని ఎన్నో పనులు నాలుగేళ్లలో..కోవిడ్ ని పక్కనపెడితే కేవలం రెండేళ్లలోనే అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ బోరెడ్డి పుల్లారెడ్డి, బేతంచెర్ల మున్సిపల్ ఛైర్మన్ చలం రెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విశ్వేశ్వరరావు, ఆర్డీవో వెంకటరెడ్డి, ఆటోనగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరారెడ్డి,మద్దిలేటి ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ రామచంద్రుడు, వైసీపీ సీనియర్ నాయకులు బాబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ప్రతిపక్షాలు, విపక్ష నేతలపై మంత్రి బుగ్గన మార్క్ పంచ్ లు

ప్రతిపక్షాలు, విపక్ష నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస యాత్రలు చేస్తున్నా ప్రతిపక్షాలకు ప్రజాదరణ కరువైందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలా పాదయాత్ర చేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. వారాహి యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూటకో మాట మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నారన్నారు. వారాహి యాత్ర చేస్తున్న నాలుగో రోజునే తానే సీఎం అని వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు. నారాలోకేశ్ ‘యువగళం’ అని మొదలుపెట్టి గళం విప్పే లోపు వారాహి వచ్చి..గళం విప్పకుండానే లోకేశ్ యాత్ర పక్కకు పోయిందన్నారు. వారాహి వాహనం ఎక్కిన పవన్ కళ్యాణ్ మొదటి రోజు పలకరింపులు, రెండో రోజు మీ చలవతో తాను సీఎం కావాలనుకుంటున్నట్లు, మూడో రోజు తానెందుకు ముఖ్యమంత్రి కాకూడదు అంటూ, నాలుగో రోజు నేనే కదా ముఖ్యమంత్రి అన్నట్లు మాట్లాడుతున్నారని మంత్రి బుగ్గన ఎద్దేవా చేశారు. ఇక నాలుగు రోజులకే జ్వరం బారిన పడ్డారని, జ్వరం తగ్గగానే టీడీపీకి 20 సీట్లిస్తానని పవన్ మాట్లాడతారేమోనని మంత్రి అన్నారు. ప్రజలకు చేసింది చెప్పి, చేయబోతున్నది వివరించే ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్ అన్నారు.

పర్యటనలో తేనెటీగల దాడిలో గాయపడిన వారికి మంత్రి బుగ్గన పరామర్శ
బేతంచెర్ల మండలం కనుమకింది కొట్టాల గ్రామంలో ఉన్న ఎర్రజాల గుహలను రాజేంద్రనాధ్ రెడ్డి పరిశీలించారు. గుహలకు ముందు ఒకటి రెండు చోట్ల కత్తితో కోసినట్లుగా విచిత్ర ఆకారంలో ఉన్న గుహలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు మంత్రి బుగ్గన కృషి చేస్తున్నారు. ఇప్పటికే చకచకా జరుగుతున్న పనులను ఆగస్ట్ కల్లా పూర్తి చేయాలని మంత్రి బుగ్గన అధికారులను ఆదేశించారు.

అయితే పరిశీలించడానికి వెళ్లిన ఆర్థిక మంత్రి సహా అధికారులు, ప్రజా ప్రతినిధుల బృందంపై గుహలలో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. మంత్రి బుగ్గన గన్ మెన్లు సహా, పోలీసు బృందం మంత్రి బుగ్గనను తేనెటీగలు కుట్టకుండా చుట్టుముట్టి నియంత్రించగలిగారు. అయితే తేనెటీగల దాడిలో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే మంత్రి బుగ్గన ఆదేశాలతో తన సిబ్బంది తేనెటీగల దాడిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నం చేశారు. ఎక్కువగా తేనెటీగలు కుట్టిన వారిని స్థానిక బేతంచెర్ల శేషారెడ్డి పీహెచ్ సీకి తరలించే ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి తీవ్రంగా గాయపడిన ఆరుమందిని పరామర్శించారు. చికిత్స జరుగుతున్న విధానాన్ని వైద్యులను అడిగి తెలుసుకుని బాధితులకు ధైర్యం చెప్పారు.ఘటన అనంతరం తేనెటీగల దాడిలో వ్యక్తిగత సిబ్బంది పరిస్థితిని ప్రత్యేకంగా మంత్రి అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News