AP Parishad Elections: ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో, వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రి గ్రామంలోని తన స్వగ్రామానికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లిన ఆయనను, ఓటు వేసేందుకు ఇంటి నుంచి బయటకు వస్తుండగా పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.
పోలింగ్ జరుగుతున్న తరుణంలో ముచ్చుమర్రి పరిధిలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షలతోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను, కీలక నేతలను ఓటు వేయకుండా అడ్డుకుంటూ హౌస్ అరెస్ట్‌లు చేస్తోందని పార్టీ శ్రేణులు, స్థానిక వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంతో పగిడ్యాల మండల పరిధిలో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

