Homeఆంధ్రప్రదేశ్Kamalapuram: ఎర్రగుడిపాడు ఆలయంలో కుల వివక్ష.. అధికారుల జోక్యం

Kamalapuram: ఎర్రగుడిపాడు ఆలయంలో కుల వివక్ష.. అధికారుల జోక్యం

కమలాపురం( తెలుగు ప్రభ): కడప జిల్లా కమలాపురం మండలం ఎర్రగుడిపాడు గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో దళితుల ప్రవేశానికి సంబంధించి చోటుచేసుకున్నట్లు చెబుతున్న ఘటనపై అధికారులు స్పందించారు. ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన దళిత వ్యక్తి, ఆయన కుమార్తెను కులం పేరుతో అడ్డుకుని దూషించినట్లు ఆరోపణలు వినిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కమలాపురం డీఎస్పీ, ఆర్డీవో ఆధ్వర్యంలో అధికారులు ఆదివారం దళితులను ఆలయంలోకి తీసుకెళ్లి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారిని దర్శనం చేయించారు. అధికారులు ఆలయ ప్రాంగణంలోనే ఉండి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించగా.. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

 

ప్రశాంత వాతావరణంలో దళితులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆలయాలు ఏ ఒక్క కులానికో చెందినవి కావని, దేవుడిని దర్శించుకునే విషయంలో ప్రతి భక్తుడికి సమాన హక్కులు ఉండాలని స్పష్టం చేశారు. కులం పేరుతో ఎవరినైనా ఆలయ ప్రవేశానికి అడ్డుకోవడం, అవమానించడం వంటి చర్యలకు తావులేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ స్ఫూర్తి గ్రామస్థాయిలోనూ అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. “దేవుడి ముందు కుల గోడలకు చోటు ఉండకూడదు.. ఆలయ ప్రవేశం ప్రతి భక్తుడి హక్కు” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ దళిత సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి ఎల్లయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి తప్పెట హరిబాబు, రాయలసీమ జిల్లాల ఇన్‌చార్జి మిద్దె వెంకటరమణ, ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్‌ మాదిగ, సోషలిస్ట్‌ యూత్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు మాతయ్య, నరసింహులు, మాచయ్య, మానికింద వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియోలోని ఆరోపణలపై పూర్తి స్థాయిలో వాస్తవాలను పరిశీలించి, ఇరువర్గాల వాదనలు తెలుసుకుని చట్టపరంగా ఏమైనా ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు అధికారులను కోరారు. ఒక ఘటన కారణంగా గ్రామంలో కుల విభేదాలు పెరగకుండా అన్ని వర్గాల ప్రజలు సామరస్యంతో ఉండేలా అధికారులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాలు అవగాహన కల్పించాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News