Census-2027: ఏపీ వ్యాప్తంగా నేటి నుండి జనగణన-2027(Census-2027) ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రాజెక్టు డైరెక్టర్ నివాస్ వివరాలను వెల్లడించారు. దేశ భవిష్యత్తు ప్రణాళికల్లో అత్యంత కీలకమైన ఈ గణన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.
మొదటి దశలో గృహాల లెక్కింపు: జనగణన ప్రక్రియలో భాగంగా తొలి దశలో గృహాల లెక్కింపు (House Listing) చేపట్టనున్నారు. ఆయా ఇళ్లలో నివసిస్తున్న వారి ప్రాథమిక సమాచారాన్ని సేకరించడం ఈ దశ ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా ఈసారి జనగణనలో ప్రభుత్వం కీలక మార్పు చేపట్టింది. ప్రజలు తీసుకునే ఆహార వివరాలపై ప్రత్యేకంగా ఆరా తీయనున్నారు. దీని ద్వారా పోషకాహార లభ్యతను అంచనా వేయడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను విశ్లేషించి, తదనుగుణంగా ప్రభుత్వ పథకాలను రూపొందించడం సులువవుతుందని డైరెక్టర్ నివాస్ వివరించారు.
Also read-Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
డేటా భద్రతకు హామీ: ఈ గణనలో ప్రజల కులం (Caste) లేదా మతం (Religion) వంటి సున్నితమైన వ్యక్తిగత వివరాలను సేకరించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ప్రజలు అందించే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని ప్రాజెక్టు డైరెక్టర్ నివాస్ తెలిపారు. డేటా సెక్యూరిటీ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. జనగణనకు ఆటంకం కలిగించినా లేదా అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ హెచ్చరించారు.

