జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన మారింది. అంతే కాదు జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేసింది ఎన్నికల సంఘం. జనసేన పార్టీని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది కేంద్ర ఎన్నికల సంఘం. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు లేఖ పంపించింది.
అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 స్థానాల్లో పోటీ చేసిన పార్టీలను రిజిస్టర్డ్ పార్టీలుగా ఈసీ పరిగణిస్తుంది. ఇలాంటి పార్టీలకు ఎలాంటి ప్రయోజనాలు అందవు. వీరికి ఓ తాత్కాలిక గుర్తును కేటాయిస్తారు. అలాగే అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో 6 శాతం ఓట్లను పొందితే దానిని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఈసీ గుర్తిస్తుంది. ఈ పార్టీలకు గుర్తుతో పాటు కొన్ని ప్రత్యేకాధికారాలను ఈసీ కేటాయిస్తుంది.
జనసేన పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 లోక్‌సభ స్థానాల్లో తిరుగులేని విజయాలని అందుకుంది. ఈ క్రమంలో జనసేన గుర్తింపు పొందిన పార్టీగా నిలిచి, గాజు గ్లాసు గుర్తును సైతం రిజర్వ్ చేసుకుంది. ఇక తమ పార్టీ గుర్తింపు పొందిన పార్టీగా నిలిచి.. గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకుందని జనసేన ఎక్స్ వేదికగా తెలిపింది.