AP Govt: బయటకి ఎలా ఉన్నా ఏపీ ఆర్ధిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. హైదరాబాద్ లాంటి మహానగరం ఉన్న తెలంగాణనే ఆర్ధికంగా కష్టాలు పడుతుందంటే.. ఇక ఏపీ పరిస్థితి చెప్పక్కర్లేదు. అయితే.. ఇది తెలుసు కాబట్టే సీఎం జగన్ కేంద్రంతో సఖ్యత ఉంటూ అందినవరకు అప్పులు తెచ్చి ప్రభుత్వాన్ని సాగిస్తున్నారు. కొత్త అప్పుల కోసం కేంద్రం ఏం చెప్పినా చేసేందుకు కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం.
ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం ప్రతి నెలా చెల్లించాల్సిన జీతాలు, ఖర్చులు కొన్ని ఉంటాయి. అలాంటి వాటికి కూడా ఏపీ ప్రభుత్వం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి సమయంలో జీఎస్టీ నిధులతో పాటు వివిధ హెడ్ ల కింద నిధులను విడుదల చేయనున్నట్లు కేంద్రం నుండి వార్త అందింది. హమ్మయ్యా ఈ నెల జీతాల చెల్లింపులకు లోటు లేదని ఊపిరి పీల్చుకొనే లోపే కేంద్రం నుండి పిడుగులాంటి వార్త వినిపించింది. జీఎస్టీ వాటాతో పాటు వివిధ హెడ్‌ల కింద మంజూరు చేసిన 982 కోట్ల రూపాయలను పాత బకాయిల కింద వెనక్కు తీసేసుకుంది.
అసలే ఆర్థిక కష్ట్రాలతో అతలాకుతలం అవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి. అసలే జీతాలు, పింఛన్ల టైం కావడంతో రాష్ట్రప్రభుత్వం తలలు పట్టుకుంటోంది. రోజు వారీ ఆదాయంతో ఎలాగోలా బయటకి పొక్కకుండా పింఛన్లు చెల్లించినా.. ఇప్పుడు జీతాల సంగతేంటి అని మల్లగుల్లాలు పడుతోంది. బహిరంగ మార్కెట్ లో ఓవర్ డ్రాఫ్ట్ కూడా మించిపోవడంతో కొత్త అప్పు వచ్చే పరిస్థితి లేదు. దీంతో దశల వారీగా చెల్లిస్తూ వస్తున్న ఉద్యోగుల జీతాలకు ఈ నెల కూడా సమయం పట్టేలానే కనిపిస్తుంది.