The Central Government on Banakacharla: తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్టు విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టుకు ఇప్పటికే కేంద్ర పర్యావరణ కమిటీ.. అనుమతులు కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక మరియు పరిపాలనా అంశాలను సమీక్షించేందుకు కేంద్ర జలసంఘం (CWC) 12 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ముగ్గురు నిపుణులను ప్రతిపాదించాలన్న దిశగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తగిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయిప్రసాద్, జలవనరుల శాఖ సలహాదారు బి. వెంకటేశ్వరరావు, ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ ఎం. నరసింహమూర్తి పేర్లు సమర్పించనున్నారు. ఈ ముగ్గురు సభ్యుల వివరాలను కేంద్ర జలసంఘానికి ఈరోజు లేదా రేపట్లో పంపే అవకాశం ఉంది. ఈ టెక్నికల్ కమిటీ బనకచర్ల ప్రాజెక్ట్ డిజైన్, నిర్మాణ విధానం, నీటి వినియోగ ప్రణాళికలపై సమగ్రంగా అధ్యయనం చేయనుంది. త్వరలో కేంద్ర జలసంఘం నుంచి ఈ ప్రాజెక్టు పై స్పష్టమైన మార్గదర్శకాలు రావచ్చని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్రానికి కీలకమైన ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తున్నందుకు ఏపీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అటు దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. తెలంగాణ తరఫున ఆ కమిటీలో ఎవరికైనా అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా స్పష్టత రావాల్సి ఉంది. అటు తెలంగాణ ప్రభుత్వం, ప్రతిపక్షం ఈ ప్రాజెక్టును తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో.. కేంద్రం నియమించిన కమిటీ ఆసక్తికరంగా మారింది. మరి ఈ కమిటీ ఏ విధమైన నివేదికలు ఇవ్వనుంది.. రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుతుందా లేదా అనేది ముందు ముందు తెలియరానుంది.


