నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో వీధి కుక్కల బెడద అధికమైంది. కుక్కలు గుంపులు, గుంపులుగా స్వైరవిహారం చేస్తూ చిన్నా పెద్ద అని తేడా లేకుండా దాడి చేస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీంతో రోడ్లమీద ప్రయాణించాలంటేనే ప్రజలు భయాబ్రాంతులకు గురవుతున్నారు. చాగలమర్రి మండల గ్రామాల్లో పొద్దు పొద్దున్నే కుక్కల సంతతి పెరిగి రోడ్ల మీద తిరుగుతున్నాయి. గతంలో ఆయా మేజర్ గ్రామ పంచాయితీ పరిధిలో కుక్కలను బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం లాంటివి చేసేవారు.
ప్రస్తుతం ఆ తరహా చర్యలు కనిపించడం లేదు. కుక్కలను చంపకుండా వాటి సంతతిని పెరగకుండా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సి ఉండగా వాటిని సైతం ఎక్కడా అమలు చేసిన దాఖాలాలు లేవు. బైక్ పై వెళ్తున్న యువకులను కుక్కలు దాడికి యత్నించగా స్థానికులు కాపాడారు. ఇదే తరహాలో జిల్లాలోని ఆయా ఏరియా ఆసుపత్రులు, పీహెచ్‌సీలలో పదుల సంఖ్యలో బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. వాటి నియంత్రణకు మాత్రం చర్యలు కరువయ్యాయి. సంబంధిత పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి కుక్కల నుంచి కాపాడాలని, తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.