పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీ టీడీపీ అని ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు(Chandrababu) తెలిపారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ(TDP Formation Day) వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీఆర్ అని తెలిపారు. ఒక మహనీయుడి విజన్ తెలుగుదేశం పార్టీ అన్నారు. ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తమదని పేర్కొన్నారు.
పార్టీకి అందరం వారసులం మాత్రమే అని.. పెత్తందారులం కాదన్నారు. తాను కూడా పార్టీకి అధ్యక్షుణ్ని.. టీమ్ లీడర్‌ను మాత్రమే అని తెలిపారు. తెలుగువారు ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందన్నారు. పార్టీని లేకుండా చేయాలని చాలా మంది ప్రయత్నించారని.. అలాంటి వారంతా కాలగర్భంలో కలిసిపోయారని పేర్కొన్నారు. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేకపోయారని.. పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గొప్పదన్నారు. పార్టీ పెట్టిన ఈ 43 ఏళ్లలో ఎన్నో సంక్షోభాలు వచ్చాయని.. అవకాశంగా తీసుకుని విజయాలు సాధిస్తున్నాని చెప్పుకొచ్చారు. పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా అని చంద్రబాబు వెల్లడించారు.