CBN Bhogapuram International Airport Inauguration : ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది! ‘అసలు అక్కడ ఎర్రబస్సే రాదు.. విమానాశ్రయం ఎలా వస్తుంది?’ అంటూ గతంలో విమర్శకులు చేసిన హేళనలను పటాపంచలు చేస్తూ, గగనతలంలో ‘ఎయిర్‌బస్’ సగర్వంగా ల్యాండ్ అయింది. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం కేవలం ఒక ప్రాజెక్ట్ ప్రారంభం మాత్రమే కాదు.. విశాఖ సహా సమగ్ర ఉత్తరాంధ్ర భవిష్యత్తు రూపురేఖలను మార్చే ఒక చారిత్రాత్మక మైలురాయి. ఈ వేదికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ—తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రతి అంశంలోనూ ‘నేషన్ ఫస్ట్’ (దేశమే ప్రథమం) అనే సిద్ధాంతాన్ని బలంగా అమలు చేసే నరేంద్ర మోదీ లాంటి అగ్రనేతను తొలిసారిగా చూస్తున్నానని స్పష్టం చేశారు.
నేషన్ ఫస్ట్ – దేశ ప్రయోజనాలే పరమావధిగా మోదీ నాయకత్వం : విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. తమ స్వార్థ రాజకీయాల కంటే దేశ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చే అరుదైన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ ఆర్థిక శక్తుల్లో ఒకటిగా నిలవడం ఖాయమని, దానికి తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంగా జరుగుతోందని వ్యాఖ్యానించారు.
‘ఎర్రబస్సు రాదన్న చోట.. ఎయిర్‌బస్సు వచ్చి వాలింది : గత పాలకులు, రాజకీయ ప్రత్యర్థులు భోగాపురం విమానాశ్రయ ప్రతిపాదనను అవహేళన చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. “ఇక్కడ కనీసం ఎర్రబస్సు కూడా సరిగ్గా తిరగదు, వీళ్లు ఎయిర్‌పోర్ట్ కడతారా?” అని నవ్విన వాళ్లు ఈ రోజు రాజకీయ అడ్రస్ లేకుండా పోయారని చురకలు వేశారు. భూసేకరణ నుంచి పర్యావరణ అనుమతుల వరకు అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ, పట్టుదలతో శ్రమించి అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించుకున్నామని తెలిపారు.
ఉత్తరాంధ్ర బిడ్డల నిబద్ధత – అల్లూరి స్ఫూర్తి : ఈ విమానాశ్రయానికి మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ‘అల్లూరి సీతారామరాజు’ పేరు పెట్టడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆ మహానీయుడి పేరు తలచుకుంటేనే ప్రతీ తెలుగువాడి గుండె ఉప్పొంగుతుందన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జీఎంఆర్ (GMR Group) ఆధ్వర్యంలోనే ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం జరగడం విశేషమని కొనియాడారు. ఈ ప్రాజెక్టు ప్రాథమిక దశ నుంచి మంజూరు వరకు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఆ తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రేయింబవళ్లు శ్రమించారని ప్రశంసించారు.

