Chandrababu Naidu : సంక్షేమ పథకాల విషయంలో ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగకుండా చూడాలని, లబ్ధిదారులకు న్యాయం జరిగేలా పార్టీ యంత్రాంగం పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం పార్టీ ముఖ్య నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, సంక్షేమ పథకాల అమలు, పార్టీ సంస్థాగత బలోపేతంపై కీలక ఆదేశాలు ఇచ్చారు.
సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి
ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘ప్రజలకు ఎంతో చేస్తున్నాం, మనం చేసిన వాటిని గట్టిగా చెప్పుకోవాలి’ అని నేతలకు సూచించారు. వైసీపీ హయాంలో నిలిచిపోయిన పింఛన్లను పునరుద్ధరించడంతో పాటు, వాటిని భారీగా పెంచిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ‘పింఛన్లు తెచ్చింది మనమే, పెంచింది మనమే’ అని ఉద్ఘాటించారు.
దివ్యాంగుల పింఛన్‌ను రూ.500 నుంచి రూ.6,000 కు, మంచానికే పరిమితమైన వారికి రూ.15,000 కు పెంచిన విషయాన్ని ప్రత్యేకంగా వివరించారు. లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ సమయంలో ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల గురించి వివరించాలని నేతలకు సూచించారు.
పార్టీ సంస్థాగత నిర్మాణం
పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే దిశగా త్వరలో జిల్లా కమిటీలను ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు జరుగుతోందని, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా కమిటీలు ఉంటాయని చెప్పారు. రాబోయే రోజుల్లో పార్టీ ప్రచార యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోషల్ మీడియా, సాంప్రదాయ మీడియా ద్వారా ప్రభుత్వ విజయాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సూపర్ సిక్స్’ పథకాల పురోగతిపై కూడా చంద్రబాబు సమీక్షించారు. ఏ ఒక్క అర్హుడికి పథకాలు అందకుండా ఆటంకాలు సృష్టించినా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో నేతలు, కార్యకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించి, ప్రజలకు సహాయం చేయాలని ఆయన కోరారు


