Chandrababu Naidu : విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య నెలకొన్న తీవ్ర వివాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఏకంగా ఎన్నికల టికెట్ కోసం డబ్బుల వ్యవహారంపై ఎమ్మెల్యే కొలికపూడి చేసిన సంచలన ఆరోపణలు, వాటిపై ఎంపీ కేశినేని చిన్ని ప్రతివిమర్శలు చేయడంతో ఈ వ్యవహారం పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సోషల్ మీడియాలో నేతల వ్యక్తిగత దూషణల రచ్చపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
దుబాయ్ నుంచే కఠిన ఆదేశాలు:
ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. ఈ వివాదంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడతానని పల్లా చెప్పగా.. “వారితో మాట్లాడాల్సిన అవసరం లేదు. యూఏఈ నుంచి వచ్చాక ఈ వ్యవహారంపై తానే స్వయంగా దృష్టి పెడతాను” అని చంద్రబాబు స్పష్టం చేసినట్టు సమాచారం.
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు:
కొందరు నేతలు బాధ్యత లేకుండా, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “బహిరంగ విమర్శలు, వివాదాలు సృష్టించే వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయి. ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు” అని ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు. పార్టీలో ఏమైనా సమస్యలుంటే, వాటిని అంతర్గత వేదికలపై చర్చించాలని నేతలకు సూచించారు.
సీఎం చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలోనే, వివాదం పరిష్కారం కోసం శుక్రవారం జరగాల్సిన తిరువూరు పంచాయితీ, ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల సమావేశాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రద్దు చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగుతున్నందున, ఈ ఇద్దరు నేతలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారనే ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది.


