Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Police Martyrs Day : గూగుల్‌కు ఆ నమ్మకం ఉంది కాబట్టే ఏపీకి వచ్చింది...

CM Police Martyrs Day : గూగుల్‌కు ఆ నమ్మకం ఉంది కాబట్టే ఏపీకి వచ్చింది – సీఎం

CM Police Martyrs Day : మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బటాలియన్ మైదానంలో ఘనంగా జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం, అమరవీరుల స్థూపం వద్ద పుష్పార్చన చేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయన్న నమ్మకంతోనే గూగుల్ వంటి ప్రపంచ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

“పెట్టుబడులకు రక్షణ ఉంటేనే పారిశ్రామికవేత్తలు వస్తారు. విశాఖపట్నంలో గూగుల్ $15 బిలియన్ (సుమారు రూ.1.25 లక్షల కోట్లు) పెట్టుబడితో ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేస్తోంది. ఇది భారతదేశంలో అతిపెద్ద FDIలలో ఒకటి, 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తుంది. శాంతి పునాది లేకుండా అభివృద్ధి రాదు” అని చెప్పారు. ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజాన్ని అణిచివేసిన ఏపీ పోలీసులను ప్రశంసించారు.

1959 అక్టోబర్ 21న లడాఖ్‌లో చైనా సైన్యంతో పోరాడి 10 మంది పోలీసులు ప్రాణత్యాగం చేసిన సంఘటన నుంచి ప్రారంభమైన ఈ దినోత్సవం, పోలీసుల త్యాగాలను స్మరించుకునే రోజు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 192 మంది పోలీసులు విధి నిర్వహణలో మరణించారు. సీఎం మాట్లాడుతూ, “పోలీసుల చేసేది ఉద్యోగం కాదు, నిస్వార్థ సేవ. వారి స్ఫూర్తితో ముందుకు సాగాలి” అని పిలుపునిచ్చారు.

సమాజంలో మారుతున్న నేరాలు, ముఖ్యంగా రాజకీయ ముసుగులో కొత్త తరహా నేరగాళ్లు పుట్టుకుంటున్నారని హెచ్చరించారు. “కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి అశాంతి సృష్టించాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణం, జీడీ నెల్లూరులో అంబేద్కర్ విగ్రహ దహనం, కల్తీ మద్యం విషయాల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. సీసీ కెమెరాలు నిజాలను బయటపెడుతున్నాయి” అని చెప్పారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం, అసత్యాలు పోలీసులకు సవాలుగా మారాయని పేర్కొన్నారు.

మారుతున్న కాలానికి తగ్గట్టు పోలీసు శాఖను టెక్నాలజీతో బలోపేతం చేస్తున్నామని సీఎం తెలిపారు. “ప్రతి 50 మీటర్లకు సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఫోన్ సిగ్నల్స్, గూగుల్ టేకవుట్ వాడుతూ నేరాలు ఛేదిస్తున్నాం. అడవుల్లో గంజాయి తోటలు, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను గుర్తించడానికి డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. ఈగల్, శక్తి బృందాలతో ఏపీ పోలీస్ దేశ ఆదర్శం” అని అభినందించారు.

పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి అండ అని భరోసా. “16 నెలల్లో వైద్య సేవలకు రూ.33 కోట్లు, 171 మరణించినవారికి రూ.23 కోట్ల బీమా. డీఏ మంజూరు, సరెండర్ లీవ్‌లు చెల్లిస్తాం. 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ పూర్తి, పదోన్నతులు సకాలంలో” అని హామీ. హోం మంత్రి వంగలపూడి అనిత, ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పోలీసుల్లో ఉత్సాహాన్ని మేల్కొలిపింది. గూగుల్ పెట్టుబడి వల్ల ఏపీ ‘ఫస్ట్ AI హబ్’గా మారనుంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad