CM Chandrababu: తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారకరామారావు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అంకితమై.. వాటిని భావితరాలకు అందించడం మన అందరి బాధ్యతని వ్యాఖ్యానించారు. మహానాడు వేదికగా మాట్లాడిన చంద్రబాబు.. ఎన్టీఆర్ సేవలను, సాధించిన చారిత్రాత్మక విజయాలను కొనియాడారు. “పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే అధికారాన్ని చేజిక్కించుకోవడం భారత రాజకీయ చరిత్రలోనే ఒక అద్భుతం. ఇప్పటివరకు దేశంలో మరెవరికీ ఇది సాధ్యం కాలేద.. కాబోదు” అని అన్నారు. తెలుగు చరిత్ర ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని చంద్రబాబు భావోద్వేగంగా పేర్కొన్నారు.
ఎన్టీఆర్‌కు ఇచ్చే నిజమైన నివాళి: ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగానే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. రాబోయే రోజుల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారని చంద్రబాబు స్పష్టం చేశారు. సమాజంలో సగానికి సగమున్న మహిళలకు రాజకీయంగా సరైన ప్రాధాన్యత కల్పించడమే ఎన్టీఆర్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.
Also read-Karnataka: అల్పాహార విందులో ఆసక్తికర ఘటన.. సిద్ధూ కాళ్లు మొక్కిన డీకే
ఎన్టీఆర్‌కు భారతరత్నఇవ్వాల్సిందే: తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ చేసిన విశేష సేవలను గుర్తిస్తూ.. ఆయనకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇది కేవలం ఒక పార్టీ కోరిక కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరి డిమాండ్ అని ఆయన అన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ మహానాడు వేదికగా ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు.

