Andhra Pradesh investments: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పెట్టుబడులు, మౌలిక వసతులు మరియు ఉద్యోగాల కల్పనపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ ఐదేళ్ల కాలంలో అనేక ప్రముఖ సంస్థలు రాష్ట్రాన్ని విడిచిపెట్టాయని ఆయన పేర్కొన్నారు. జాకీ, లులు, అమర్‌రాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ వంటి కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని వివరించారు.
అభివృద్ధి మందగించి…
గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి మందగించిందని, యువతకు అవకాశాలు లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని ఆయన గుర్తు చేశారు. నైపుణ్యాల అభివృద్ధి విషయంలో కూడా సరైన చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు.
Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/ap-council-heated-debate-over-tirumala-laddu-issue/
20 లక్షల మందికి ఉద్యోగాలు..
ఎన్నికల ముందు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. రాష్ట్రాన్ని మళ్లీ పెట్టుబడులకు అనుకూల వాతావరణంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు గుర్తింపుగా నిలుస్తోందని పేర్కొన్నారు.
175 నియోజకవర్గాల్లో…
పెట్టుబడులను వేగంగా ఆకర్షించేందుకు మొత్తం 26 విధానాలను అమల్లోకి తీసుకొచ్చామని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేస్తున్నామని చెప్పారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చి మరింత ప్రోత్సాహం అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు పనులు జరుగుతున్నాయని తెలిపారు. పరిశ్రమలకు ప్రోత్సాహకంగా ఇప్పటికే రూ.210 కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు.
ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొచ్చిందని సీఎం వివరించారు. ఆ సదస్సు ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా సుమారు 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
ఎంఎస్ఎంఈ రంగంలో …
ఉద్యోగాల కల్పనలో వివిధ రంగాల్లో పురోగతి సాధించామని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ రంగంలో 2.48 లక్షల మందికి ఉపాధి లభించిందని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల ద్వారా 1.46 లక్షల మందికి అవకాశాలు కల్పించామని వివరించారు. పరిశ్రమలలో 95 వేల మందికి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 64 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు.
మెగా డీఎస్సీ, పోలీసు కానిస్టేబుళ్లు…
అలాగే మెగా డీఎస్సీ, పోలీసు కానిస్టేబుళ్లు, ఇతర ప్రభుత్వ నియామకాల ద్వారా 30,500 మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 6.28 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించామని వెల్లడించారు.
ఎకనామిక్ జోన్లుగా అభివృద్ధి..
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం తెలిపారు. విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ఎకనామిక్ జోన్లుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. దీర్ఘకాల దృష్టితో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/el-nino-impact-kurnool-records-highest-temperatures/
రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన శాసనసభలో పేర్కొన్నారు.

