TrueDown Chandrababu Naidu: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. దేశ చరిత్రలో తొలిసారి ‘ట్రూడౌన్’తో విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తున్నామని తెలిపారు. నవంబర్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఈ మేరకు ‘X’ వేదికగా సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పారు.
15 నెలల్లో విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణతో వచ్చిన ఫలితాల ఆధారంగానే ఈ ఘనత సాధించినట్లు సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ విధానం ద్వారా పీక్ డిమాండ్ సమయం నెలకొందని.. అలాంటి సమయాల్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్ల విధానానికి చెక్ పెట్టామని తెలిపారు. పవర్ స్వాపింగ్ విధానం ద్వారా స్వల్ప కాలిక కొనుగోళ్లలో అధిక రేటుకు విద్యుత్‌ను కొనుగోలు చేసే అవసరం రాలేదని సీఎం వెల్లడించారు.
‘ట్రూడౌన్ పేరుతో యూనిట్‌కు రూ. 13 పైసలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాం. నవంబర్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఎన్నికల్లో చెప్పినట్లు ట్రూడౌన్ ద్వారా ప్రజలకు రూ. 923 కోట్ల మేర భారం తగ్గిస్తున్నాం. రానున్న రోజుల్లో క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పి ప్రజలకు మరింత చౌకగా విద్యుత్‌ను సరఫరా చేస్తాం.’ అని సీఎం ‘X’లో పేర్కొన్నారు.
పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు సౌర విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నామని సీఎం అన్నారు. పీఎం సూర్యఘర్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందుతోందని చెప్పారు. బీసీ వినియోగదారులకు గరిష్ఠంగా రూ. 98 వేలు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. 1500 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. ఇలా అనేక సమర్థమైన చర్యలతో విద్యుత్ రంగాన్ని కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిందని సీఎం చంద్రబాబు వివరించారు.


