Sunday, February 8, 2026
Homeఆంధ్రప్రదేశ్Chandrababu Naidu: ఏపీకి పెట్టుబడులే లక్ష్యం.. దావోస్‌కు బయలుదేరిన చంద్రబాబు బృందం

Chandrababu Naidu: ఏపీకి పెట్టుబడులే లక్ష్యం.. దావోస్‌కు బయలుదేరిన చంద్రబాబు బృందం

Chandrababu team leaves for Davos: ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ పర్యటనకు బయలుదేరారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం(WEF) 2026 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఉన్నతస్థాయి బృందంతో కలిసి నేటి(ఆదివారం) రాత్రి విజయవాడ నుంచి పయనమయ్యారు. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్‌తో పాటు పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు. జనవరి 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో చంద్రబాబు అత్యంత బిజీగా గడపనున్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఇందులో భాగంగా 16 మంది పారిశ్రామిక దిగ్గజాలతో వన్-టు-వన్ మీటింగ్స్, 9 రౌండ్‌టేబుల్ సమావేశాలు, 3 దేశాల ప్రతినిధులతో ప్రభుత్వ స్థాయి భేటీలు జరగనున్నాయి. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, తయారీ, ఐటీ, ఫార్మా రంగాల్లో ఉన్న అవకాశాలను వివరించి, పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.

- Advertisement -

ప్రపంచ వేదికపై రాష్ట్రానికి గుర్తింపు తేవడమే లక్ష్యం..

ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు.. ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ కలిస్టా రెడ్‌మండ్, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ వంటి వ్యాపార ప్రముఖులతో సమావేశమవుతారు. అలాగే, యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రితోనూ భేటీ కానున్నారు. ప్రపంచ వేదికపై రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు దావోస్‌లో వరుసగా రెండో ఏడాది కూడా ‘ఏపీ లాంజ్’ పేరుతో ప్రత్యేక పెవిలియన్‌ను ఆయన ఏర్పాటు చేశారు. దావోస్‌కు వెళ్లే ముందు జ్యూరిచ్‌లో 20 దేశాల నుంచి వచ్చే ప్రవాస భారతీయులతో నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. జనవరి 23న సీఎం బృందం తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News