అమరావతి, నవంబర్ 5 (తెలుగుప్రభ): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడంపై కూటమి నేతలు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. పోలింగ్ శాతం ఏమాత్రం తగ్గకుండా చూడాలని స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఎన్డీఏ ముఖ్య నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు చేశారు.
వృద్ధులు, దివ్యాంగులు సహా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించాలని కూటమి శ్రేణులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు తోడ్పడాలని కోరారు. ఎన్నికలకు ఆటంకం కలిగించే ప్రయత్నాలు ఎవరైనా చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. గొడ్డలి పార్టీ అక్రమాలకు పాల్పడితే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఎక్కడైనా ఘర్షణలు తలెత్తితే కార్యకర్తలు సంయమనం పాటించాలని చంద్రబాబు హితవు పలికారు.
కాగా, ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది అభ్యర్థులు, 7,767 ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 31,460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే నిర్వహించిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి మంచి ఫలితాలు సాధించిన విషయం తెలిసిందే.

