ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు(Inter Exams) నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu ), విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ధైర్యంగా, ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో డీహైడ్రేట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. ప్రయత్నం సరిగ్గా చేస్తే తప్పకుండా విజయం వస్తుందని ట్వీట్ చేశారు.
కాగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి 20 వరకు జరిగే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,535 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఇందులో 68 కేంద్రాలను సున్నిత, 36 కేంద్రాలను అతి సున్నితమైనవిగా గుర్తించారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇక 10,58,893 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,00,963 మంది, ఒకేషనల్ విద్యార్థులు 44,581 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. రెండో సంవత్సరం జనరల్ విద్యార్థులు 4,71,021 మంది, ఒకేషనల్ విద్యార్థులు 42,328 మంది ఉన్నారు.