ఏపీ మంత్రివర్గంలో(AP Cabinet) త్వరలోనే మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సోదరుడు, జనసేన నేత నాగబాబు(Nagababu)ను మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో జనవరి 8న ఆయన మంత్రిగా ప్రమాణం చేస్తారని సమాచారం. ఐదు నెలల తర్వాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పోస్టుల్లో ఒకటి నాగబాబుకు ఇవ్వడం కూడా దాదాపుగా ఖాయమైంది. ప్రస్తుతం కేబినెట్‌లో 25 మంది ఉండగా.. ఒకటి ఖాళీగా ఉంది.
నాగబాబుతో మంత్రివర్గ విస్తరణ పూర్తి చేస్తారు అనుకున్నప్పటికీ ఒకరిద్ధరు మంత్రులను మార్చే అవకాశముందన్న ప్రచారం జరగడం ఆసక్తికరంగా మారింది. ఎంత హెచ్చరించినా పనితీరు మార్చుకోని ఇద్దరు ముగ్గురు మంత్రులపై వేటు వేసే అవకాశం ఉందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. నాగబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావును మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.
కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక సమీకరణలు, పాలనలో కొత్తదనం వంటి అంశాల నేపథ్యంలో మంత్రివర్గం ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి వర్గంలో తొలి సారి గెలిచిన వారికి చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టడం చర్చనీయాంశమైంది.అయితే వారి పని తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి మంత్రివర్గంలో మార్పులు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.