Monday, May 20, 2024
Homeఆంధ్రప్రదేశ్మారుతున్న సమీకరణలు

మారుతున్న సమీకరణలు

జనసేన నాయకుడు, ప్రముఖ టాలీవుడ్ కథానాయకుడు పవన్ కల్యాణ్ కు జనాకర్షణ ఉంటే ఉండవచ్చు. కానీ, వైఎస్ఆర్ పార్టీ అగ్ర నాయకుడు, ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న వారసత్వ బలం, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడికి ఉన్న రాజకీయానుభవం, కార్యదక్షతతో ఈ జనాకర్షణకు ఇది గట్టి పోటీ ఇవ్వగలుగుతుందా? ప్రజలను కూడగట్టుకోవడానికి, ప్రజాభిమానాన్ని తనకు రాజకీయపరంగా అనుకూలంగా చేసుకోవడానికి పవన్ కల్యాణ్ చేపట్టిన జనవాణి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీల సమీకరణాలను అతలాకుతలం, అస్తవ్యస్తం చేస్తుండడమే కాకుండా ఇంకా ఏడాదిన్నరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రంలో రాజకీయాలను ఇప్పటి నుంచే వేడెక్కిస్తోంది. తమిళనాడులో ప్రసిద్ధ నటులు ఎంజీ రామచంద్రన్, జయలలిత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్ర నటుడు ఎన్ టీ రామారావు తమ రికార్డు స్థాయి ప్రజాభిమానంతో, అభిమాన సంఘాల అండదండలతో అందలం ఎక్కిన మాట నిజమే కానీ, మారిన రాజకీయ పరిస్థితులలో అటువంటి అభిమాన గణ ఆదరణ ఎన్నికల్లో ఓట్లుగా మారే అవకాశం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

- Advertisement -

మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం అనేక మార్పులు చేర్పులకు లోనవుతోంది. కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో ప్రజల నుంచి, అభిమానుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం, ఈ జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించడం రాష్ట్రంలోని వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వాన్ని తీవ్రంగా కలవరపెడుతోందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అందుకు నిదర్శనం ఏమిటంటే, పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమం కింద రాష్ట్రమంతా పర్యటిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించింది. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఆయనే ఒక ముఖ చిత్రంగా మారుతున్న క్రమాన్ని రాజకీయ పక్షాలన్నీ గుర్తించటం ప్రారంభమైనట్టుంది. రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పవన్ కల్యాణ్ పార్టీకి తిరుగులేని మద్దతునిస్తుండగా, వై.ఎస్.ఆర్.సి.పి.కి, తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఆయనతో పొత్తుకు సిద్ధపడింది. వామపక్షాలు కూడా ఆయనకు అండగా నిలబడుతున్నాయి.

ఇటీవల విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన పవన్ కల్యాణ్ మాత్రం ఎవరితోనూ ప్రత్యక్ష సంబంధం లేకుండా ఒంటరిగానే పోరాటానికి సిద్ధపడుతున్నట్టు కనిపిస్తోంది. తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి సాధించలేకపోయినది తాను సాధించాలని పవన్ కల్యాణ్ గట్టి పట్టుదలతో ఉన్నారని అర్థమవుతోంది. చిరంజీవి నాయకత్వంలో ఏర్పడిన ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నికల సందర్భంలోనూ ప్రజానీకానికి ఎన్నో వాగ్ధానాలు చేసింది కానీ, వాటిని నెరవేర్చలేక పోయింది. వాటిని నెరవేర్చాలన్నదే పవన్ కల్యాణ్ ధ్యేయంగా కనిపిస్తోంది. 2009లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మీద ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసింది కానీ, ప్రజలు కాంగ్రెస్ నే గెలిపించడంతో ఆ పార్టీ దాదాపు చతికిలపడిపోయింది. మూడేళ్ల తరువాత ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడం కూడా జరిగిపోయింది. ప్రజారాజ్యం పార్టీ యువత విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న పవన్ కల్యాణ్ రాజకీయాల పట్ల విసుగెత్తిపోయి, కొద్దికాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉండి, ఆ తరువాత జనసేన పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో పోటీ చేసి ఒక్క స్థానం మాత్రమే గెలుచుకోగలిగారు. ఈనేపథ్యంలో పవన్ జనాకర్షణ ఈసారి ఎన్నికల్లో ఎంతవరకు పనిచేస్తుందన్నది ఆలోచించాల్సిన విషయం. ఏది ఏమైనా అప్పటికీ ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నమాట మాత్రం కాదనలేని నిజం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News