Wednesday, September 18, 2024
Homeఆంధ్రప్రదేశ్Child marriages: బాల్య వివాహాలపై ‘దిశ’ ఉక్కుపాదం

Child marriages: బాల్య వివాహాలపై ‘దిశ’ ఉక్కుపాదం

పోలీసులకు దిశ యాప్ ద్వారా అత్యవసర మెసేజ్ పంపుతున్న బాధితులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు నెలల కాలంలో 34 బాల్య వివాహాలను దిశ చట్టం కింద అడ్డుకున్నట్టు దిశ పోలీస్ స్పెషల్ ఆఫీసర్ జి. పాలరాజు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో దిశ పోలీసులు చురుకుగా వ్యవహరిస్తూ బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేస్తున్నారని, గత శనివారం కూడా ఒక బాల్య వివాహాన్ని ఆపడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

కడప జిల్లా సిద్దవటంలో ఓ 15 బాలికకు కుటుంబ పెద్దలు వివాహం నిశ్చయం చేయగా, పోలీసులు సకాలంలో స్పందించి, హుటాహుటిన వెళ్లి ఆ వివాహానికి అడ్డుకట్ట వేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఆ బాలికకు ఆమె బంధువుతో వివాహాన్ని నిశ్చయం చేశారని, అయితే ఆ బాలికకు ఈ వివాహం ఇష్టం లేదని, ఆమె స్నేహితులు దిశా యాప్ లో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెళ్లి చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన వివరించారు. ఆ బాలికకు, ఆమె తల్లితండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారని కూడా పాలారాజు తెలిపారు.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం, ఆ బాలిక దినసరి వేతన కూలీలకు కుమార్తె. ఇటీవలే ఆ బాలిక ఇంటర్మీడియట్ కోర్సు పూర్తి చేసింది. ఆమె తల్లితండ్రులు ఒక దూరపు బంధువుతో ఆమె వివాహాన్ని నిశ్చయం చేశారు. ఆమె ఈ పెళ్లికి ససేమిరా అనడమే కాకుండా తన స్నేహితులకు ఈ విషయం తెలిపింది. ఏదో విధంగా ఈ పెళ్లిని ఆపాలనే ఉద్దేశంతో ఆమె స్నేహితులు దిశ పోలీసులకు దిశ యాప్ ద్వారా ఒక అత్యవసర మెసేజ్ ను పంపించడం జరిగింది. పోలీసులు వెంటనే సిద్దవటం పోలీసులకు సమాచారం అందించారు. సిద్దవటం పోలీసులు ఎనిమిది నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. అప్పటికి, జూలై 23న, ఆమె తల్లితండ్రులు ఆమె పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు.

‘‘మొదటగా బాలికకు, వరుడికి కౌన్సెలింగ్ ఇచ్చాం. వారి తల్లితండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. బాలికకు 18 ఏళ్లు వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయాలని, అప్పటి వరకూ ఆగాలని సూచించాం. ఈలోగా ఆ బాలికకు చదువు చెప్పించాలని కూడా సలహా ఇవ్వడం జరిగింది’’ అని పోలీసులు తెలిపారు. ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు సంపాదించుకున్న ఆ బాలిక డిగ్రీ పూర్తి
చేయాలనుకుంటున్నట్టు చెప్పింది. పిల్లల తల్లితండ్రులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల, ఆచార సంప్రదాయాల వల్ల, పేదరికం కారణంగా, ఆడపిల్లలకు భద్రత లేకపోవడం వల్ల ఇలా బాల్య వివాహాలు జరుగుతున్నాయని పాలారాజు వివరించారు. ఈ దిశా యాప్ ను దాదాపు కోటి మంది డౌన్ లోడ్ చేసుకున్నట్టు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News