జనసేన(Janasena) పార్టీ 12వ ఆవిర్భావ దినోవత్స వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో నిర్వహించిన వేడుకల్లో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా ప్రసంగించారు. తన ప్రసంగంలో పార్టీ 11 ఏళ్లలో పడిన కష్టాలు, పోరాటాలను వివరించారు. అలాగే వైసీపీ నాయకులపైనా విమర్శలు గుప్పించారు. తాను ఓడిపోయినప్పటికీ అడుగులు ముందుకే వేశానని చెప్పారు. తాము నిలబడి, పార్టీని నిలబెట్టామని.. అంతేగాక నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టామన్నారు. అహంకారంతో విర్రవీగిన వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశామని పేర్కొన్నారు.
పవన్ ప్రసంగానికి ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఫిదా అయ్యారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘మైడియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్.. జనసేన జయకేతన సభలో నీ స్పీచ్‌కి మంత్రముగ్ధుడినయ్యాను. సభ కొచ్చిన అశేష జన సంద్రం లానే నా మనసు ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు.’ అంటూ రాసుకొచ్చారు.