Tuesday, February 25, 2025
Homeఆంధ్రప్రదేశ్CM CBN: వాట్సాప్ ఎలా వాడాలో నేర్పండి: సీఎం చంద్రబాబు ఆదేశం

CM CBN: వాట్సాప్ ఎలా వాడాలో నేర్పండి: సీఎం చంద్రబాబు ఆదేశం

క‌లెక్ట‌రేట్ల‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ సెల్‌

జిల్లా క‌లెక్ట‌ర్ల కార్యాల‌యాల్లో ప్ర‌త్యేకంగా మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ సెల్ ఏర్పాటు చేసి, వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను ప్ర‌జ‌లు విస్తృతంగా ఉప‌యోగించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌ను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ప్ర‌భుత్వం వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా ప్ర‌జ‌ల‌కు 500 సేవ‌లు క‌ల్పించ‌నుందని తెలిపారు.

- Advertisement -

ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి

స‌చివాల‌యంలో రియల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ పై ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వాట్సాప్ గ‌వర్నెన్స్ అమ‌లు ప్ర‌గ‌తి గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించి వారు ఈ సేవ‌ల‌ను విస్తృతంగా ఉప‌యోగించుకునేలా చేయ‌డంపై అధికారులంద‌రూ ప్ర‌త్యేక దృష్టి క‌ల్పించాల‌న్నారు. జిల్లా క‌లెక్ట‌ర్లంద‌రూ ఈ విష‌యంలో కీల‌కంగా ప‌నిచేయాల‌న్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ కోసం ఒక ప్ర‌త్యేక సెల్ ఏర్పాటు చేసి, ఆయా జిల్లాల్లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ అమ‌లును ప‌ర్య‌వేక్షించాలన్నారు.

క్యూఆర్ కోడ్ కనిపించేలా పెట్టండి

ప్ర‌భుత్వ సేవ‌లు ప్ర‌జ‌ల‌కు చాలా సుల‌భ‌త‌రంగా అందించాల‌న్న‌దే ప్ర‌భుత్వ ఆశ‌య‌మ‌ని, ఇందులో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ కీల‌క పాత్ర పోషిస్తుంద‌న్నారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఆయా శాఖ‌ల్లో ప్ర‌భుత్వ సేవ‌లు వాట్సాప్ ద్వారా సుల‌భంగా పొందేలా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేలా క్యూఆర్ కోడ్ ప్ర‌ద‌ర్శించాల‌న్నారు. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా ప్ర‌జ‌ల నుంచి విన‌తులు, వాటి ప‌రిష్కారాలు కూడా మెరుగవ్వాల‌న్నారు. అలాగే ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లు చెల్లించాల్సిన బిల్లులు కూడా వాట్సాప్ ద్వారా విరివిగా జ‌రిగేలా చూడాల‌ని ఆ దిశ‌గా ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని సూచించారు. చాలా మంది ప్ర‌జ‌ల్లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ఎలా ఉప‌యోగించాలో స‌రైన అవ‌గాహ‌న లేద‌ని, వారిలో అవ‌గాహ‌న పెంచేలా ప్ర‌సార‌ మాధ్య‌మాలను ఉప‌యోగించుకోవాల‌ని తెలిపారు. గ్రామ, వార్డ్ స‌చివాల‌యాల్లో కూడా ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించే ఏర్పాట్లు చేయాల‌న్నారు. ప్ర‌తి ఇంట్లోనూ ఒక ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్సు నిపుణులు ఉండేలా తీర్చిదిద్దాల‌ని సూచించారు.

డ్రోన్ పెట్రోలింగ్‌
శాంతిభ‌ద్ర‌త‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో టెక్నాల‌జీని విరివిగా వాడుకుని స‌త్ఫ‌లితాలు సాధించాల‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌కు సూచించారు. పోలీసు గ‌స్తీకి స‌మాంతరంగా డ్రోన్ల‌ను విరివిగా ఉప‌యోగించుకుని డ్రోన్ పెట్రోలింగ్ వ్య‌వ‌స్థ ఏర్పాటు చేసుకోవాల‌ని తెలిపారు. దానివ‌ల్ల పోలీసుల‌కు గ‌స్తీ ప్ర‌క్రియ మ‌రింత సుల‌భ‌త‌రమ‌వ్వ‌డ‌మే కాకుండా స‌త్ఫ‌లితాలు కూడా వ‌స్తాయ‌న్నారు. ఆర్టీజీఎస్‌లో డేటా లేక్ ఏర్పాటు ప్ర‌క్రియ‌లో భాగంగా జ‌రుగుతున్న డేటా అనుసంధాన ప్ర‌క్రియ వేగ‌వంతంగా పూర్తి చేయాల‌ని సీఎం సూచించారు.

ఆర్టీసీ బ‌స్సుల‌న్నిటికీ జీపీఎస్ ఉండాలి
రాష్ట్రంలో ఆర్టీసీ బ‌స్సుల‌న్నిటికీ జీపీఎస్ వ్య‌వ‌స్థ ఉండాల‌ని సీఎం సూచించారు. త‌ద్వారా ప్ర‌యాణీకుల‌కు తాము ప్ర‌యాణించాల్సిన బ‌స్సు ఏ ప్రాంతంలో ఉంది, ఎక్క‌డ ఉంది, ఎంత స‌మ‌యానికి వ‌స్తుంద‌నేది సుల‌భంగా తెలిసిపోతుంద‌ని చెప్పారు. గూగుల్ స‌హ‌కారం తీసుకుని ఈ వ్య‌వ‌స్థ‌ను త్వ‌ర‌తిగ‌త‌గిన ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. పింఛ‌న్ల పంపిణీకి జీపీఎస్ ట్రాకింగ్ వ్య‌వ‌స్థ పెట్టి ప‌ర్య‌వేక్షించే అవ‌కాశాన్ని ప‌రిశీలించాల‌న్నారు.

బెల్టు షాపుల‌పై ఉక్కుపాదం

రాష్ట్రంలో బెల్టు షాపుల‌ప‌ట్ల అధికారులు క‌ఠినంగా ఉండాల‌ని, వాటిని ఏమాత్రం ఉపేక్షించ‌కూడ‌ద‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికీ కొన్ని ప్రాంతాల్లో బెల్టుషాపులు న‌డుస్తున్నాయ‌ని ఇది ఏమాత్రం ఆమోద‌యోగ్యం కాద‌న్నారు. వీటిపైన అధికారులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. ఆయా బెల్టుషాపుల‌కు ఎవ‌రు, ఏ మ‌ద్యం షాపు నుంచి మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేశార‌నేదానిపై నిఘా పెట్టి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. బెల్టుషాపుల‌ను అరిక‌ట్టాల‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఉచిత ఇసుక స‌ర‌ఫ‌రా మెరుగుప‌డుతోంద‌ని, అయితే అక్క‌డ‌క్క‌డా ఇంకా కొన్ని స‌మ‌స్య‌లు క‌నిపిస్తున్నాయ‌ని వాటిపైన కూడా దృష్టి పెట్టాల‌ని కోరారు. ఆర్టీజీ సెక్ర‌ట‌రీ భాస్క‌ర్ కాటంనేని మ‌ట్లాడుతూ డేటా లేక్‌, వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ త‌దిత‌ర కార్యక్ర‌మాల‌పై ఆర్టీజీఏస్ చేప‌డుతున్న ప్ర‌గ‌తి గురించి సీఎంకు వివ‌రించారు.

ఈ సమావేశంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్‌, సాధ‌ర‌ణ ప‌రిపాల‌న ముఖ్య కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా, సీఎం కార్య‌ద‌ర్శులు పీఎస్ ప్ర‌ద్యుమ్న‌, ర‌విచంద్ర‌, రాజ‌మౌళి, ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News