CM Chandrababu Projects: ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షం ‘క్రెడిట్ చోరీ’ చేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ప్రాజెక్టుల ద్వారా నీళ్లు రాకుండానే రిబ్బన్ కట్ చేసి క్రెడిట్ తీసుకోవాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో గురువారం సీఎం చంద్రబాబు మాట్లాడారు.
దేశంలోనే పోలవరం వంటి అతిపెద్ద ప్రాజెక్టు మరెక్కడా లేదని, పుష్కరాల కంటే ముందే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు శాసనసభ వేదికగా ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో పెండింగ్‌లో ఉన్న నాగావళి, చంపావతి, జంఝావతి వంటి ప్రాజెక్టులను రెండేళ్ల కాలంలో పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. చింతలపూడి ప్రాజెక్టును సైతం త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు. తమ నియోజకవర్గమైన కుప్పంకు కూడా నీళ్లిస్తామని గతంలో హామీ ఇచ్చారని, కానీ అది నెరవేరలేదని గుర్తు చేశారు.
‘’గంగా- కావేరి అనుసంధానం కావాలనేది నా ప్రగాఢ ఆకాంక్ష. ‘గంగా-కావేరి అనుసంధానం సాధ్యాసాధ్యాలపై ఆనాడే చర్చలు జరిగాయి. నదుల అనుసంధానం చేసి తెలుగుతల్లికి జలహారతి ఇచ్చే బాధ్యత మాది. వెలిగొండ ప్రాజెక్టుకు నేనే శంకుస్థాప చేశా.. నేనే పూర్తి చేస్తున్నా. ధవళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మాణం వల్ల కాటన్ దొరను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నారు. నీళ్లు రాకుండానే ఎవరైనా జాతికి అంకితం చేస్తారా.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read: https://teluguprabha.net/business/five-thousand-customers-forex-card-cvv-data-theft-in-yes-bank/
కాగా, తమ ప్రభుత్వ పథకాలను ‘క్రెడిట్ చోరీ’ చేస్తోందని వైసీపీ చేసిన ఆరోపణలను చంద్రబాబు తోసిపుచ్చారు. అమరావతి రాజధానిని ఎడారిగా మార్చిన వారు ఇప్పుడు అభివృద్ధిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

