CM Chandrababu Water Conservation: రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపుదల, నీటి సంరక్షణ కోసం సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” పేరుతో 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను (యాక్షన్ ప్లాన్) ప్రకటించారు. ఏప్రిల్ 6 నుంచి జులై 14వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జల మట్టాలను కనీసం ఒక మీటరు మేర పెంచడమే ‘నీటి భద్రత- సాగునీట సంఘాల బాధ్యత’ పథకం ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 60,000 మంది సాగునీటి సంఘాల సభ్యులకు ముఖ్యమంత్రి కీలక బాధ్యతలు అప్పగించారు.
ఈ పథకంలో భాగంగా చెరువులు, కాల్వల్లో పేరుకుపోయిన పూడికను తీయడం, ఫీడర్ ఛానెళ్లను శుభ్రం చేయడం, విచ్చలవిడిగా పెరిగిన గుర్రపు డెక్కను తొలగించడం వంటి ప్రధాన పనులు చేపట్టనున్నారు. అనంతరం రాష్ట్రంలోని చెక్ డ్యాంలకు మరమ్మతులు చేయడం, అవసరమైన చోట కొత్త నిర్మాణాలను చేపట్టడం వంటివి ఈ పథకంలో ఉన్నాయి. ఇందుకోసం ప్రతి సాగునీటి సంఘం తమ పరిధిలో వాటర్ బడ్జెట్‌ను తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పథకంలో భాగంగా భూగర్భ జలాలను పెంచుతూ, నీటి సంరక్షణ చేపట్టేందుకు ఇరిగేషన్, అటవీ, పంచాయతీ రాజ్, వ్యవసాయ, పశుసంవర్థక శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికిలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ఈ నీటి సంరక్షణ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజా చైతన్యం, ప్రజల భాగస్వామ్యంతో ఈ 100 రోజుల ఉద్యమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

