CM Chandrababu Vetlapalem: వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన చంద్రబాబు.. అనంతరం కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరిశీలించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా ఫ్యాక్టరీలో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు ఘటనలో 21 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన పలువురు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం క్షతగార్తులను పరామర్శించారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సీఎంకు వివరించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

పేలుడు ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు.. విచారణ పూర్తయ్యాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పలువురు అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

‘క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తాం. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. పేలుడు పదార్థాల వద్ద జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్వాహకులు విఫలమయ్యారు. ఈ తరహా ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటాం. బాధ్యులైన వ్యక్తుల ఆస్తులు జప్తు చేసి బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తాం. కొందరు వ్యక్తులు ఇక్కడ పదేళ్లుగా పనిచేస్తున్నారు. అనుమతి లేకుండా బాణసంచా తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
మరోవైపు వేట్లపాలెం దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని ‘X’ వేదికగా పేర్కొన్నారు.

