Super Six Schemes: రాష్ట్ర ప్రజలకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తాము ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో మంగళవారం నిర్వహించిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన అనంతరం ప్రజావేదికపై ప్రసంగించారు.
సంక్షేమ పథకాల ‘సూపర్ సిక్స్’ విజయం:
పింఛన్ల పంపిణీపై మానవత్వంతో ఆలోచించి, ప్రతి నెలా స్వయంగా గ్రామాలకు వచ్చి పర్యవేక్షిస్తున్నానని సీఎం తెలిపారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌లో కేవలం రూ.500 మాత్రమే పింఛను ఇస్తుంటే, ఏపీలో వందలో 13 మందికి పింఛను ఇస్తున్నామని, అందులో 59 శాతం మహిళలకే అందిస్తున్నామని వివరించారు. ఒక్క పింఛన్‌తో సరిపెట్టకుండా, తమ కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
మహిళా సాధికారతకు కృషి:
మహిళా సంక్షేమం తమ ప్రభుత్వ లక్ష్యమని చెబుతూ, ఆడబిడ్డలు కష్టపడకూడదనే ఉద్దేశంతో గతంలో దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, ఇప్పుడు ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత ప్రయాణం కల్పించామని, కేవలం 45 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 10 కోట్ల మంది మహిళలు ఈ ప్రయోజనాన్ని పొందారని పేర్కొన్నారు. అలాగే, డ్వాక్రా సంఘాలను తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే అని గుర్తు చేస్తూ, రుణాలు తీసుకున్న మహిళలు తిరిగి చెల్లించి తమ నిబద్ధతను నిరూపించుకున్నారని ప్రశంసించారు.
రైతు, యువతపై దృష్టి:
రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రైతు ఆదాయాన్ని పెంచేందుకు ఆలోచన చేస్తోందన్నారు. పేదరికంలో ఉన్న విజయనగరం జిల్లా రైతులను, సాగునీటి కొరత ఉన్న ప్రాంతాల రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఇప్పటికే రైతు భరోసా కింద ఒక్కో రైతుకు రూ.6,000 వేశామని, త్వరలో మరో రూ.14,000 కూడా జమ చేస్తామని హామీ ఇచ్చారు.
ఉద్యోగ కల్పనే బాధ్యత:
యువతకు ఉద్యోగాల కల్పన తన బాధ్యతగా తీసుకున్నానని సీఎం అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మెగా డీఎస్సీ నిర్వహించామని, ఈ 15 నెలల్లో ఏకంగా 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీని ద్వారా 9 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి సమతుల్యతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.


