టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) 75వ జన్మదిన వేడుకులను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయాల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆలయాల్లో నేతలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు 75 కిలోల కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్, వర్ల రామయ్య, అశోక్‌బాబు, వీవీవీ చౌదరి, నన్నపనేని రాజకుమారి, ఎ.వి.రమణ హాజరయ్యారు.
ఇక అలిపిరిలో చంద్రబాబు జన్మదినం సందర్భంగా భారీగా కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నందమూరి సుహాసిని, టీటీడీ బోర్డు సభ్యుడు నర్సిరెడ్డి, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. అలాగే ప్రతి పట్టణం, గ్రామంలో స్థానిక నేతలు, కార్యకర్తలు అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.