CM Chandrababu: నిండుకుండలా మారిన శ్రీశైలం డ్యామ్ గేట్లను సీఎం చంద్రబాబు ఎత్తి నీటిని నాగార్జున సాగర్‌కు వదిలారు. ముందుగా కృష్ణా నదికి జల హారతులు ఇచ్చి, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తారు. దీంతో కృష్ణమ్మ పాలనురుగుల్లా కక్కుంటూ కిందకు పరవళ్లు తొక్కింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ హయాంలోనే మెజారిటీ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించామని తెలిపారు. పోతిరెడ్డిపాడు, గాలేరు-నగరి, గండికోట ప్రాజెక్టులు తామే నిర్మించామని చెప్పుకొచ్చా. జలాలే మన సంపద అని.. వాటితోనే రైతుల కష్టాలు తీరతాయన్నారు.
రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టంచేశారు. ఈమేరకు తన దగ్గర బ్లూ ప్రింట్ ఉందన్నారు. గోదావరి నుంచి బనకచర్ల ప్రాజెక్టుకు నీరు తెస్తే రాష్ట్రంలో కరువు ఉండదని పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్లు నిర్మించడం తన సంకల్పమని తేల్చి చెప్పారు. ఏటా 2 వేల టీఎంసీలు సముంద్రంలోకి వెళ్తున్నాయని.. ఇందులో ఏపీ 200 టీఎంసీలు, తెలంగాణ 200 టీఎంసీలు వాడుకోవచ్చని సూచించారు. ఈ నీటిని వాడుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని స్పష్టం చేశారు. తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్ వన్ కావాలనేది తన లక్ష్యమన్నారు. ఇక పోలవరం ఏపీకి పెద్దవరం అన్నారు. రాయలసీమకు నీళ్లు వస్తున్నాయంటే పోలవరం వల్లే అన్నారు.
Also Read: మహిళల జోలికి వస్తే తాటతీస్తాం.. వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ హెచ్చరికలు
ఈ సందర్భంగా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలోని మహిళలు అందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. అయితే ఏ జిల్లాకు చెందిన మహిళలు ఆ జిల్లా వరకే ఉచితంగా తిరిగే అవకాశం ఉందని షరతులు విధించారు. కేవలం జిల్లాకే ఉచిత బస్సు పరిమితమని స్పష్టత ఇచ్చారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు లాంటివన్నారు. ఓవైపు అభివృద్ధి చేసుకుంటూనే.. మరోవైపు సంక్షేమం అమలు చేస్తున్నానని పేర్కొన్నారు. ఇతర పార్టీలకు టీడీపీకి ఉన్న తేడా ఇదేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


