Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: పిల్లలు భారం కాదు.. వాళ్లే మన సంపద.. శ్రీకాకుళం పర్యటనలో సీఎం కామెంట్స్

CM Chandrababu: పిల్లలు భారం కాదు.. వాళ్లే మన సంపద.. శ్రీకాకుళం పర్యటనలో సీఎం కామెంట్స్

CM Chandrababu comments during Srikakulam visit: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సమాజంలో మార్పు వస్తేనే స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్‌ సాకారమవుతుందన్నారు. గత 16 నెలలుగా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ చెత్తను సంపదగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. పాదయాత్రల సమయంలో ఎక్కడ చూసినా చెత్తే కనిపించేదని, ఇప్పుడు చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -

Also Read: Bike Taxi: ఆ రాష్ట్రంలో ఇక బైక్‌ ట్యాక్సీలు ఉండవు.. గూగుల్‌, యాపిల్‌కి కీలక నోటీసులు

మూడో బిడ్డకి రూ. 30 వేలు, నాలుగో బిడ్డకి రూ. 40 వేలు..

ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడాలని, తలసరి ఆదాయం పెరగాలని, ఈ మేరకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. సంపద సృష్టించి పేదలకు పంచడం ద్వారా ఆర్థిక అసమానతలను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి మంచి పేరు రావడంలో అధికారుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు. ప్రజల్లో జనాభాపై అవగాహన మారాలని, ఒకప్పుడు కుటుంబ నియంత్రణ అవసరమని చెప్పామని, కానీ ఇప్పుడు పిల్లలే కుటుంబానికి సంపద అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. జనాభా పెంపును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. మూడో బిడ్డ పుట్టిన వెంటనే రూ.30 వేలు, నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేలు ఇస్తామని ప్రకటించారు. “పిల్లలు భారమని అస్సలు భావించకూడదు.. వాళ్లే మన భవిష్యత్తు సంపద” అని పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం కింద రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, భగవంతుడు కరుణిస్తే ఈ మొత్తాన్ని మరింత పెంచుతామన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు ఎన్నో అరాచకాలను చూశారని, గత ప్రభుత్వం ప్రజల భూముల విషయంలో గందరగోళం సృష్టించిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తుల రక్షణకు చర్యలు తీసుకున్నామని, భూ తగాదాలు లేకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

రాష్ట్రానికి రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులు..

రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. గత 23 నెలల్లో రాష్ట్రానికి రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా 24 లక్షల ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. విశాఖపట్నానికి గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలను తీసుకొచ్చామని, పరిశ్రమల అభివృద్ధితో ఉత్తరాంధ్ర ప్రాంతం ఉద్యోగాలకు కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు అచ్చెన్న, బగ్గు రమణమూర్తి, అశోక్, జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News