CM Chandrababu cooked fish: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో పర్యటించారు. అక్కడ జరిగిన ఓ సన్నివేశం అందర్నీ ఆకట్టుకుంది. ఓ మత్య్సకార కుటుంబం ఇంటికి వెళ్లి స్వయంగా చేపల పులుసు వండటంతో పాటు నేలపైనే కూర్చొని భోజనం చేసిన సన్నివేశం మంత్రముగ్ధుల్ని చేస్తోంది. మంగళవారం ‘మత్య్సకారుల సేవలో’ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అనంతరం స్థానిక చేపల మార్కెట్‌ను సందర్శించి స్వయంగా చేపలు కొనుగోలు చేసి మత్స్యకారులతో మాట్లాడారు. మత్స్యకారుడు తానంగారి బాబు ఇంటికి వెళ్లి చేపల పులుసుతో భోజనం చేశారు. మార్కెట్‌లో చేపలు విక్రయిస్తున్న మహిళా వ్యాపారులతో మాట్లాడిన చంద్రబాబు స్థానిక చేపల రకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మత్స్యకారుడు తానంగారి బాబు, ఆయన కుమారుడు గిరి ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్లారు. సీఎం తీసుకెళ్లిన చేపలతో తానంగారి బాబు సతీమణి వెంకమ్మ చేపల పులుసు వండగా, చంద్రబాబు అక్కడే ఉండి వంట విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. సరదాగా గరిటె తిప్పి అందరినీ ఆకట్టుకున్నారు. ఇటీవల ప్రసవించిన వెంకమ్మ కుమార్తెను పలకరించి తల్లీబిడ్డ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేసిన సీఎం, స్వయంగా చేపల పులుసు వడ్డించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Also Read: EPFO services: గుడ్‌న్యూస్.. వాట్సాప్‌లోపే అన్ని రకాల ఈపీఎఫ్‌ఓ సేవలు.. యూపీఐ విత్‌డ్రా సైతం..!
మత్స్యకారులకు ఏటా రూ. 20 వేల ఆర్థిక సాయం..
ఈ సందర్భంగా ‘మత్య్సకారుల సేవలో’ పథకం ద్వారా ఏడాదికి అందుతున్న రూ. 20 వేల ఆర్థిక సాయం తమ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతోందని తానంగారి బాబు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తమ ఇంటికి ముఖ్యమంత్రి రావడం జీవితాంతం మరిచిపోలేని సంఘటన అని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం తమ మార్కెట్‌కు రావడం పట్ల మత్స్యకారులు, వ్యాపారులు ఆనందం వ్యక్తం చేశారు. మత్స్యకారుడు తానంగారి బాబుతో మాట్లాడిన సీఎం.. వారి జీవనోపాధి, చేపల వేట పరిస్థితులు, మార్కెట్‌లో చేపల విక్రయాలపై అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి సీఎం చంద్రబాబు గ్రూప్ ఫోటో దిగారు.

