CM Chandrababu| ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్ దేశంలో పర్యటించనున్నారు. దావోస్(Davos)వేదికగా జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక(WEF) సదస్సులో పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చంద్రబాబు స్విస్ పర్యటనకు వెళ్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు మంత్రులు, అధికారులు కూడా వెళ్లనున్నారు. దీంతో సీఎం పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు అధికారుల బృందం ఇప్పటికే దావోస్‌కు వెళ్లింది. దావోస్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ఏర్పాటు, సమావేశాల నిర్వహణకు అవసరమైన ప్రదేశాలను ఈ అధికారుల బృందం ఎంపిక చేస్తుంది.
కాగా గతంలో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు ఐదేళ్లలో దావోస్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు సాధించేందుకు కృషి చేశారు. ఆయన చొరవతో పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇదిలా ఉంటే 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి మాత్రమే సీఎం జగన్ బృందం దావోస్ సదస్సుకు హాజరైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దావోస్ పర్యటనపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 20లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం ఏమేరకు పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తుందో అనే ఆసక్తి నెలకొంది.