CM Chandrababu Delhi Tour Schedule: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. మంగళవారం (జూలై 15), బుధవారం (జూలై 16) రోజుల్లో ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి చెందిన అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల విడుదల, ఉపాధి పథకాల అమలుపై ఆయన చర్చలు జరిపే అవకాశం ఉంది.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మరియు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ లతో భేటీ కానున్నారు. ఈ భేటీల్లో రాష్ట్ర అత్యంత ప్రధాన ప్రాజెక్టులైన పోలవరం మరియు బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులపై అనుమతులు, ఆ ప్రాజెక్టులను నిర్మించేందుకు కావాల్సిన నిధుల విషయంపై చర్చలు జరగనున్నాయి.
మంగళవారం ఉదయం చంద్రబాబు అమరావతి నుండి ఢిల్లీకి బయలుదేరి, మధ్యాహ్నం అమిత్ షాతో సమావేశమవుతారు. అనంతరం ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ మరియు ఢిల్లీ మెట్రో అధికారులతోనూ చర్చలు జరిపే అవకాశం ఉంది. ఆ రోజు సాయంత్రం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జ్ఞాపకార్థంగా ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీలో జరుగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు.
బుధవారం రోజు చంద్రబాబు ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో నార్త్ బ్లాక్ లో ప్రత్యేకంగా భేటీ అవుతారు. రాష్ట్ర అవసరాలను కేంద్రానికి వివరించనున్నారు. ఇక అదే రోజు సాయంత్రం ఆయన భారత పరిశ్రమల సమాఖ్య (CII) నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు. అన్ని కార్యక్రమాలు ముగిసిన అనంతరం, జూలై 17 ఉదయం 9:30కి చంద్రబాబు ఢిల్లీ నుంచి అమరావతికి తిరిగి రానున్నారు.
సీఎం చంద్రబాబు ఈ పర్యటనలో పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానంపై కీలకమైన పలు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టు అనుమతికి సంబంధించిన విషయాలు మాట్లాడడంతో పాటు నిధులు కూడా కేటాయింపులపై కూడా ఒక స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రాష్ట్రానికి సంబంధించిన కొన్ని రాజకీయ అంశాలపై కూడా చర్చలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన కేవలం ఏపీకి మాత్రమే కాకుండా, తెలంగాణకు కూడా ఆసక్తికరంగా మారింది.


