Saturday, September 28, 2024
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu first 5 signs: 5 ఇంపార్టెంట్ ఫైల్స్ పై చంద్రబాబు తొలి...

CM Chandrababu first 5 signs: 5 ఇంపార్టెంట్ ఫైల్స్ పై చంద్రబాబు తొలి సంతకాలు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలను చేపట్టారు. గురువారం సాయంత్రం 4.41 గంట‌ల‌కు సచివాలయం మొదటి బ్లాక్‌లోని త‌న ఛాంబర్‌లో సీఎంగా ఆయ‌న బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద‌ర్బంగా ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకునేలా ఆయ‌న కీల‌క ద‌స్త్రాల‌పై సంత‌కాలు చేశారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలుపై ఆయ‌న సంతకాలు చేశారు. మొత్తం అయిదు ద‌స్త్రాల‌పై ఆయ‌న సంత‌కం పెట్టారు. తొలి సంత‌కం మెగా డీఎస్సీపై, రెండో సంత‌కం ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై , ముడో సంత‌కం సామాజిక భ‌ద్ర‌త‌లో బాగంగా పింఛన్ల‌ను రూ.4 వేలకు పెంచుతూ, నాలుగో సంత‌కం అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం, అయిదో సంత‌కం నైపుణ్య గ‌ణ‌న ద‌స్త్రాల‌పై ఆయ‌న సంతకాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌తో పాటు రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి ప‌చ్చ‌జెండా

నిరుద్యోగ యువతకు మేలు చేకూరేలా మొత్తం 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం చంద్ర‌బాబు మొదటి సంతకం చేశారు. కేటగిరిల వారీగా పోస్టుల వివరాల‌ను ప‌రిశీలిస్తే… ఎస్‌జీటీ 6,371, పీఈటీ 132, స్కూల్‌ అసిస్టెంట్స్‌ 7725, టీజీటీ 1781, పీజీటీ 286, ప్రిన్సిపల్స్ 52 ఖాళీలు ఉన్నాయి.

దుర్మార్గమైన చట్టం ర‌ద్దు

ప్రజలను తీవ్ర‌ భయభ్రాంతుల‌కు గురి చేసిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దుపై సీఎం చంద్రబాబు రెండో సంతకం చేశారు. ప్రజల స్థిరాస్తులను కొట్టేయడానికి జగన్‌ ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ఈ చట్టాన్ని 2023 అక్టోబర్‌ 31న తీసుకొచ్చిన విష‌యం విదిత‌మే. ఈ చట్టం ముసుగులో కొందరు ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూ భక్షణకు ఆస్కారం ఇచ్చేలా వివిధ సెక్షన్లను రూపొందించారు. కబ్జా చేసిన ఆస్తులకు చట్టబద్ధత తెచ్చుకునేందుకు పావులు కదిపారు. ఈ నేప‌థ్యంలో తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ ఫోటో ముద్రించిన పాసుపుస్తకాన్ని చించివేసి ప్రజలకు భరోసానిచ్చారు. సామాన్యుల ఆస్తులకు ఈ చట్టంతో రక్షణ లేకుండా పోతుందని న్యాయవాదులు, మేధావులు, నిపుణులు ఆవేద‌న వ్య‌క్తం చేసిన విష‌యం విదిత‌మే.

పింఛ‌నుదారుల‌కు భ‌రోసా

2024 ఎన్నికల ప్రచారంలో పింఛ‌ను మొత్తాన్ని 4 వేలకు పెంచుతామని సీఎం చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ఏప్రిల్‌ నుంచి పెంచిన పింఛన్ మొత్తాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు పింఛన్‌ను రూ. 6 వేలకు పెంచుతామన్నారు. ఈ హామీలను నెరవేరుస్తూ ఆయ‌న మూడో సంతకం చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, తదితర విభాగాల వారికి జులై 1న, కొత్తగా పెంచిన పింఛన్‌ 4 వేలు, అలాగే ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు వెయ్యి రూపాయల చొప్పున పెరిగిన మొత్తం రూ. 3 వేలు కలిపి రూ. 7 వేల పింఛన్‌ను అందించనున్నారు. ఆగస్టు నుంచి లబ్దిదారులకు 4 వేల రూపాయల పింఛన్‌ అందనుంది. దీని కోసం రూ.2800 కోట్లు అవుతాయ‌ని అంచ‌నా.

పేదల ఆక‌లి తీర్చే అన్నక్యాంటీన్ల పునఃప్రారంభం

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. అల్పాహారం, భోజనాన్ని 5 రూపాయలకే అందించారు. సగటున రోజుకు రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల మంది అల్పాహారం, భోజనం తినేవారు. నాటి ప్ర‌భుత్వం సుమారు 31 కోట్లు ఖర్చుచేసింది. ఆ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన సీఎం జ‌గ‌న్ కక్షతో వీటిని మూసివేయించారు. అధికారం చేపట్టిన వెంటనే వీటిని పునరుద్ధరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ మేరకు నాలుగో సంతకాన్ని అన్న క్యాంటీన్ల దస్త్రంపై పెట్టారు.

నైపుణ్య గణనతో ఉపాధి క‌ల్ప‌న‌

యువత ఉన్నతస్థాయి విద్యను అభ్యసించినా దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే. ఈ సమస్య పరిష్కారానికే కూటమి నేతలు ఎన్నికల్లో నైపుణ్య గణన హామీనిచ్చారు. చంద్రబాబు ఐదో సంతకాన్ని ఈ దస్త్రంపైనే పెట్టనున్నారు. దీని ద్వారా ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలున్నాయనేది తేల్చనున్నారు. ఏ తరహా ఉద్యోగాలు పొందేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో, వేటికి డిమాండ్ ఉంది, రాష్ట్రంలో ఉన్న నిరోద్యోగుల్లో ఎవ‌రివ‌రికి నైపుణ్య అర్హ‌త‌లు ఉన్నాయి వంటి వాటిని తెలుసుకోవ‌డానికి ఈ గ‌ణ‌న ఉప‌యోగ‌ప‌డుతుంది. త‌ద్వారా వారికి ఉపాధి క‌ల్ప‌న‌కు అవ‌కాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News