CM Chandrababu foreign tour: ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మూడు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ్టి నుంచి 24 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో పర్యటిస్తారు. ఈ పర్యటన ప్రధానంగా దుబాయ్, అబుదాబి ప్రాంతాల్లో జరుగనుంది. ఈ టూర్ లో భాగంగా సీఎం పెట్టుబడులను ఆకర్షించబోతున్నారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆహ్వానించడం ఈ పర్యటన లక్ష్యంగా ఉంది. ఈ టూర్ తో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించనున్నారు. ఈ టూర్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, పోర్టులు, షిప్ మేనేజ్‌మెంట్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను రప్పించాలనే ఉద్దేశంతో చంద్రబాబు పర్యటన సాగనుంది.
ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి చంద్రబాబు బయలుదేరతారు. సుమారు ఉదయం 9 గంటలకు బయలుదేరే అవకాశం ఉంది. దుబాయ్‌లో ఉదయం 11 గంటల సమయంలో ల్యాండింగ్ అవుతారని తెలుస్తోంది. ఆ తర్వాత వెంటనే వన్-టు-వన్ మీటింగులు ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట మంత్రి బీసీ జనార్దన రెడ్డి, పరిశ్రమల మంత్రి టీజీ భరత్, సీఎం కార్యాలయ సీక్రటరీ కార్తీకేయ మిశ్ర, పరిశ్రమల విభాగం సీక్రటరీ ఎన్ యువరాజ్, ఏపీఈడీబీ సీఈఓ సైకాంత్ వర్మ, రతన్ తాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ధాత్రి రెడ్డి ఈ పర్యటనలో ఉంటారు.


