వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు(Vizag Steel Plant) కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ(PM Modi), కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman), కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి(kumaraswamy)కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
‘‘కేంద్రం విశాఖ ఉక్కుకు ప్రత్యే ప్యాకేజీ ప్రకటించడం ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయం. విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదు. ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. రాష్ట్ర ప్రజలకు ఇకపై అన్నీ మంచి రోజులే. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’’ అని తెలిపారు.
కాగా నష్టాల్లో ఉన్న విశాఖ పరిశ్రమను మళ్లీ నిలబెట్టేందుకు రూ.11,440 కోట్లతో కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు. ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఆపరేషనల్ పేమెంట్స్ కోసం ఈ ప్యాకేజీని వినియోగించనున్నారు.