ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డ సంగతి తెలిసిందే. సింగపూర్‌లో శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ క్రమంలోనే పవన్ కుమారుడు కాళ్లు, చేతులకు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు.
“సింగపూర్‌లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అక్కడ చదువుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను” అని తెలిపారు.
ఇక వైసీపీ అధినేత జగన్ కూడా స్పందించారు. సింగపూర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాని తెలిసి నేను షాక్ అయ్యాను. మార్క్ శంకర్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు.
ఇక ఏపీ మంత్రి లోకేశ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, తదితర ప్రముఖులు పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెట్టారు.