CM Chandrababu Comments: ప్రకాశం జిల్లా వీరాయపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర పథకంతో కలిపి, తొలి విడతలో రైతుల ఖాతాల్లో రూ. 7,000 చొప్పున జమ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపికైన కొంతమంది రైతులకు చెక్కులు అందజేశారు.
ఇందుకు అనుగుణంగా, ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి చేసిన ప్రసంగాన్ని భారీ స్క్రీన్‌పై ప్రత్యక్ష ప్రసారం చేశారు. సీఎం చంద్రబాబు రైతులతో కలిసి ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం అని, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
కరోనా సమయంలోనూ రైతుల కృషిని కొనియాడిన సీఎం
కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా రైతులు మట్టిని వదలకుండా కృషి చేశారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని వైసీపీ రద్దు చేసిందని మండిపడ్డారు. తాము ప్రారంభించిన వ్యవసాయ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. మహిళల సాధికారత కోసం తానే పునాదులు వేసినప్పటికీ, కొంతకాలం తన పాలనను మరచిపోయారని అన్నారు. అంతేకాదు, “కొత్త బిచ్చగాళ్లు” వచ్చినప్పుడు ప్రజలు వారి మాటలు నమ్మి తప్పు చేశారని విమర్శించారు. ఇప్పుడు ప్రజలు తిరిగి మంచి నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు.
స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం – ఆగస్ట్ 15న RTCలో ఉచిత రైడ్
ఆగస్ట్ 15వ తేదీన ‘స్త్రీ శక్తి’ పథకం ప్రారంభించనున్నట్లు ప్రకటించారు చంద్రబాబు. ఈ పథకం ద్వారా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. దాదాపు రోజూ 2.6 కోట్ల ప్రయాణాలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతాయని తెలిపారు. మహిళల పట్ల గౌరవాన్ని తెలియజేస్తూ, “రోజుకోసారి అయినా నన్ను గుర్తు పెట్టుకోండి” అని అన్నారు. ‘సూపర్ సిక్స్’ హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని, ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. “తల్లికి వందనం” వంటి పథకాల విషయంలో గత పాలకుల తీరును తప్పుబట్టి, తాము న్యాయం చేశామని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలపై ప్రజలు విశ్వాసం పెట్టకూడదని విజ్ఞప్తి చేశారు. సమయానుగుణంగా పంటలలో వైవిధ్యం తీసుకురావాలని, రైతులు నష్టాలు చవించకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. అటు ఈ సభలో ప్రతిపక్షంపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై దుమ్మెత్తి పోస్తున్నారని ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటామన్నారు.


