CM Chandrababu London Tour Ahead Of Vizag Partnership Conference: ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్ 2 నుంచి మూడు రోజుల పాటు లండన్‌లో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేలా ఆయన లండన్ పర్యటన సాగనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెల విశాఖలో జరగనున్న సదస్సుకు హాజరు కావాలని లండన్‌లోని బిజినెస్‌మెన్‌లను సీఎం చంద్రబాబు కోరనున్నారు. ఇక లండన్ కంటే ముందు దుబాయ్, యూఏఈ, అబుదాబిల్లోనూ చంద్రబాబు పర్యటన సాగనుంది. కాగా, నవంబర్ 14, 15న విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో సీఎం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సదస్సుకు రావాలని లండన్‌లోని పారిశ్రామికవేత్తల్ని సీఎం కోరనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుంకు గల అవకాశాలను వారికి వివరించనున్నారు. కాగా, సీఎం చంద్రబాబు వెంట పలువురు అధికారులు వెళ్లనున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాతోపాటు మరికొంతమంది అధికారుల బృందం లండన్‌లో పర్యటించనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: https://teluguprabha.net/career-news/nmms-scholarship-for-merit-students/
పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా..
మరోవైపు, అక్టోబర్ 22 నుంచి 24వ తేదీ వరకు సీఎం చంద్రబాబు దుబాయ్, అబుదాబి, యూఏఈల్లో పర్యటించనున్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఈ దేశాలకు వెళ్లనున్నారు. ఈ విదేశీ పర్యటనలో భాగంగా రియల్ ఎస్టేట్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్ సహా రవాణా, ఇన్నోవేషన్స్, ఫైనాన్స్ సర్వీసెస్ రంగాల్లో పెట్టుబడుదారులను ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ఈ విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి కూడా వెళ్లనున్నారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం విదేశాల్లో పర్యటిస్తోంది. పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా ఇప్పటికే సింగపూర్, దావోస్‌లో సైతం చంద్రబాబు పర్యటించారు. ఇక, విశాఖ వేదికగా నవంబర్‌లో రెండు రోజుల పాటు భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సహా పలువురు ఉన్నతాధికారుల బృందం కూడా ఇటీవలె దక్షిణ కొరియాలో పర్యటించింది. దక్షిణ కొరియా ప్రభుత్వాధికారులతో పాటు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించి, వారిని కూడా ఈ విశాఖ సదస్సుకు రావాలని మంత్రి నారాయణ ఆహ్వానించారు. ఈ పర్యటనల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయని కూటమి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


