మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యపై సీఎం చంద్రబాబు(Chandrababu) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తొలుత వివేకాది గుండెపోటు మరణం అని తాను కూడా అనుకున్నానని తెలిపారు. విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ గుండెపోటు అని చెప్పడంతో అందరితో పాటు తాను నమ్మాల్సి వచ్చిందన్నారు. అయితే వివేకా కూతురు సునీత పోస్టుమార్టం అడగటంతో గొడ్డలితో చంపేసిన సంగతి బయటకు వచ్చిందన్నారు. లేదంటే సైలెంట్‌గా అంత్యక్రియలు జరిపించేవాళ్లని తెలిపారు. అందుకే నేరాలు-ఘోరాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి సంచలన కేసులు వచ్చినప్పుడు పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
అలాగే తన జీవితంలో ఏ రోజూ తాను హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యాలయాలపై దాడి జరిగిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులపై ఎప్పుడూ దాడి జరగలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే మాత్రం ఉపేక్షించనని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు ‘ఈగల్’ అనే ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. ఇక ఆడబిడ్డల జోలికొస్తే వారికి అదే ఆఖరు రోజు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు.