Diwali Celebrations: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో దీపావళి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ముఖ్యమంత్రి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు.
ముందుగా ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు దంపతులు, దీపాలను వెలిగించి చీకటిపై వెలుగు సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు కలిసి కాకర పూవొత్తులు వెలిగించి ఆనందంగా బాణసంచా కాల్చారు. నిత్యం రాజకీయ, పాలనాపరమైన కార్యక్రమాలతో బిజీగా ఉండే సీఎం చంద్రబాబు, కుటుంబంతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం అభిమానులు, కార్యకర్తలకు సంతోషాన్నిచ్చింది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు నిండాలని, రాష్ట్రం ప్రగతితో ప్రకాశించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి దంపతుల దీపావళి వేడుకల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


