నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ(Mega DSC) నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు(Chandrababu) ప్రకటించారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు ఈమేరకు ప్రకటన చేశారు. ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన తమ ప్రభుత్వం లక్ష్యం అని తెలిపారు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు తప్పవన్నారు. సంక్షేమ కార్యక్రమాలు కావాలంటే ఆదాయం కావాలన్నారు. గత ఐదేళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు. గత పాలనతో విసిగిపోయిన ప్రజలు తమను అఖండ మెజార్టీతో గెలిపించారని తెలిపారు. సమస్యల పరిష్కారంలో కలెక్టర్లది కీలకపాత్ర అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.