Amit Shah- CBN: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆయన.. అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెండింగ్‌లో ఉన్న బకాయిలు, రాష్ట్రానికి సంబంధించిన నిధుల విడుదలపై ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం.
అమిత్ షాతో పాటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో కూడా సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ఆయనతో చర్చలు జరిపారు. కాగా, ఆదిరావం ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ముగిసిన మరుసటి రోజే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రానికి అవసరమైన కేంద్ర సహకారం, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశాలు ఈ పర్యటనలో ప్రధాన అజెండాగా ఉన్నాయి.
Also Read: https://teluguprabha.net/telangana/pochampally-ikkat-at-paris-fashion-show/
ఇక, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీలో సీఎం చంద్రబాబు పలు విజ్ఞప్తులు చేశారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన అంశాలను పరిష్కరించాలని కోరారు. 2027 గోదావరి పుష్కరాల లోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 297 నీటి వనరుల పునరుద్ధరణ కోసం రూ. 285 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని విన్నవించారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృథాగా పోయే 200 టీఎంసీల వరద జలాలను రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలకు మళ్లించేలా పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు అనుమతులు కోరారు.
అదేవిధంగా సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచే అంశంపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వవద్దని కోరారు. వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి ఒడిశాతో ఉన్న భూసేకరణ సమస్యలను పరిష్కరించేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి కృషి సీంచాయి యోజన (PMKSY) కింద రాష్ట్రంలోని చెరువులు, కుంటల పునరుద్ధరణ మరియు కాలువల పూడికతీత పనులకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.

