CM Chandrababu CII Summit: సంక్షోభం నుంచి వచ్చిన సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన సీఐఐ(CII) వార్షిక వ్యాపార సదస్సులో పాల్గొన్న సీఎం.. కీలక ప్రసంగం చేశారు. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ మిషన్ ప్రకటించారని.. ఆ మిషన్‌ను అందరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇది కేవలం ప్రధాని టాస్క్ మాత్రమే కాదని.. మనందరిదని స్పష్టం చేశారు.
ప్రతి సవాలు వెనుక ఒక అవకాశం ఉంటుందని.. సంక్షోభాలనే అభివృద్ధికి పునాదిగా మార్చుకోవాలని చంద్రబాబు అన్నారు. జాతీయ మిషన్ ద్వారా ఆర్థిక స్వాలంబన, ఇంధన పరిరక్షణను ఒక జాతీయ బాధ్యతగా చేపట్టాలని ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న విప్లవాత్మక మార్పులపై మాట్లాడారు. 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నామని చంద్రబాబు అన్నారు. ట్రాన్స్‌మిషన్ నష్టాలు లేకుండా మైక్రో గ్రిడ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
భారత్ సువర్ణావకాశాల కేంద్రంగా ఎదుగుతోందని, ప్రపంచ సవాళ్లను అధిగమించి భారత్ ‘అన్‌స్టాపబుల్’గా మారుతుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించడం, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ చర్యలను చేపట్టాలని సూచించారు. భారత్ సెమీకండక్టర్లు, AI రంగాల్లో కూడా పెద్ద మార్పులకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల దృష్ట్యా, విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుకోవడానికి బంగారం కొనుగోలును వాయిదా వేయడం, సహజ వ్యవసాయం వైపు మొగ్గు చూపడం వంటి చర్యలను చంద్రబాబు సమర్థించారు.

