CM Chandrababu Naidu: విజయవాడ వేదికగా జరిగిన వరుణ్ గ్రూప్ డైమండ్ జూబ్లీ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరుణ్ గ్రూప్ సాధించిన విజయాలను, సమాజానికి అందిస్తున్న సేవలను ప్రశంసించారు. 75 ఏళ్లుగా సంస్థ విజయవంతంగా కొనసాగడం ఒక గొప్ప మైలురాయి అని, ఇది కొన్ని సంస్థలకు మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు.
వరుణ్ గ్రూప్ కేవలం వ్యాపారంలోనే కాకుండా సామాజిక బాధ్యతలో కూడా ముందుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పేదలకు వైద్య సేవలు అందించడం, విశాఖలోని నోవాటెల్ హోటల్ ద్వారా నాణ్యమైన సేవలు ఇవ్వడం వంటి అంశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాకుండా, త్వరలో అమరావతిలో కూడా నోవాటెల్ నిర్మిస్తున్నారని తెలిపారు.
వరుణ్ గ్రూప్ వంటి సంస్థలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయని, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. వ్యాపారంతో పాటు సామాజిక సేవలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న వరుణ్ గ్రూప్ యాజమాన్యానికి, ఉద్యోగులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులను కూడా ఆయన స్మరించుకున్నారు.


